తెలంగాణ

telangana

ETV Bharat / city

Rice Cultivation Issue: యాసంగిలో వరి సాగుపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..? - rabi crops in telangana called as

రాష్ట్రంలో వరి కొనుగోళ్ల అంశం ఆందోళనకరంగా మారిన పరిస్థితుల్లో.. ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముందని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పంటమార్పిడీ ఆవశ్యకతను రైతులకు వివరిస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Rice Cultivation Issue, paddy cultivation problems in telangana, యాసంగిలో వరి సాగు
Rice Cultivation Issue

By

Published : Nov 22, 2021, 5:01 AM IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం... ఏడేళ్ల కాలంలో వ్యవసాయ అనుకూల విధానాలు అమలు చేయడంతో సాగు విస్తీర్ణం, దిగుబడులు గణనీయంగా పెరిగాయి. వానా కాలంలో దాదాపు 63 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైన దృష్ట్యా కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తోంది. క్షేత్రస్థాయిలో చేతికొచ్చిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని కల్లాలు, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తుండటంతో... ఆందోళనలు మిన్నంటుతున్నారు. ఈ తరుణంలో రాబోయే యాసంగి ధాన్యం పంట సేకరించబోమని ఎఫ్‌సీఐ రాష్ట్రానికి లేఖ రాయడంతో... ఇక ఈ రబీ నుంచి వరి సాగు వద్దని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.

ఈ ఒక్కసారైనా కొనుగోలు చేయాలి..

కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర సాగు నీటి వనరులు అందుబాటులోకి రావడం, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ చర్యలు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాల వంటి చర్యల వల్ల అధిక శాతం రైతులు వరి సాగుపై మొగ్గు చూపుతున్న వేళ... కేంద్రం నిర్ణయం ఓ పిడుగులా పడింది. అది కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య పరస్పర ఆరోపణలు, ధర్నాలు, ఇతర ఆందోళనలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల్లో ఓ అయోమయం నెలకొలనడంతో దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా వరి సంక్షోభానికి పలు రకాలు కారణాలు ఉన్నప్పటికీ... ఎవరిది బాధ్యత అన్న అంశం చర్చించుకోకుండా రైతుల సంక్షేమం కోణంలో కనీసం ఈ ఒక్కసారైన బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని... వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఓ ప్రణాళిక ప్రకారం రైతుల్లో చైతన్యం..

2014లో పునర్విభజన అనంతరం.. వర్షపాతం, నీటిపారుదల అద్భుతంగా ఉండటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రెట్టింపు పైగా వరి సాగు పెరిగిపోయింది. తెలంగాణ సీడ్‌ హబ్‌, ఫుడ్ హబ్, ప్యాకింగ్ హబ్, లాజిస్టిక్ హబ్‌, నాలెడ్జ్ హబ్, రీసెర్చ్ హబ్, వాటర్ బౌల్‌గా రూపాంతరం చెందింది. ఇంత ప్రగతి సాధించిన తెలంగాణ... ఈ చిన్న సమస్య ఎందుకు అధిగమించలేకపోతోంది అన్నది ఓ ప్రశ్నగా మారింది. రాష్ట్ర జనాభా, డిమాండ్, వినియోగం, సరఫరా అంశాల ఆధారంగా బియ్యం, వంట నూనెలు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు పండించినట్లైతే... రాష్ట్రీయ అవసరాలు పోను మిగతావి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు వరి తీసుకుంటే 50 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపోతుంది. మిగిలింది ఎగుమతి చేసుకోవడంపై దృష్టి సారించాలి. వరిలో తీసుకుంటే పొడవు గింజకు మంచి డిమాండ్ ఉంటుంది. బియ్యంలో అనేక రకాలు ఉన్నందున గల్ఫ్ దేశాల్లో బాస్మతీ రైస్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. గొప్ప పంట వైవిధ్యం ఉన్న దష్ట్యా... భారత వ్యవసాయ పరిశోధన మండలి - అనుబంధ వరి, నూనెగింజలు, చిరుధాన్యాల పరిశోధన సంస్థలు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సరిగ్గా ఓ ప్రణాళిక రూపొందించి రైతుల్లోకి తీసుకెళితే మంచి చైతన్యం కలుగుతుంది. పంట కాలనీ వ్యవస్థ అమలుకు నోచుకోకపోవడం వల్లే ఇప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతున్నందున ఈ అంశంపై శాస్త్రవేత్తలతో కూడిన ఓ అధ్యయన కమిటీ ఏర్పాటుచేసి ఆ సిఫారసులు అమలుచేయాలని శాస్త్రవేత్తలు కోరారు.

ఎకాయకిన సాధ్యం కాని పరిస్థితి..

కొవిడ్-19 నేపథ్యంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత అత్యంత పెరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న జనాభా 70 నుంచి 78 శాతం వరకు పెరిగింది. ఈ రెండేళ్లల్లో ఆ శాతం పెరిగిందంటే సేద్యంలో ఉపాధి ఉన్నట్లు అవగతమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌, వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి, పత్తి ప్రధాన పంటలుగా రూపదాల్చడం ఆందోళన కలిగించే అంశమే. సాగు సరళి మారాలంటే నిజాం షుగర్స్‌ పునరుద్ధరిస్తే బోధన్, సంగారెడ్డి, జగిత్యాల తదితర ప్రాంతాల్లో రైతాంగం చెరకు సాగు వైపు మళ్లే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ పంటలకు మంచి మార్కెట్ భరోసా కల్పిస్తే కంది, పెసర, మినుములు, వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, ఆముదం, అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర పంటల సాగుకు రైతులు ముందుకొస్తారనడంలో సందేహంలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం... రాజకీయపార్టీలు, రైతుసంఘాలు, శాస్త్రవేత్తలతో మాట్లాడితే... ఓ హేతుబద్ధమైన చర్చ పరిష్కారానికి దారి చూపుతుందన్నది నిపుణుల మాట. పంట విధానం మారాలని అనుకున్న తరుణంలో అది ఎకాయకిన సాధ్యం కాదు. ప్రభుత్వం బెదిరింపులు, ఒత్తిళ్ల వరి పంట సాగు చేయవద్దనడం సరికాదు... రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రత్యామ్నాయాల సాధన చర్యలు తీసుకోవడంతోపాటు కేంద్రం... పారాబాయిల్డ్ రైస్ విషయంలో షరతులు తొలగించి రాష్ట్రం ఏదిస్తే అది ఈ ఏడాది కొనుగోలు చేయాలని నిపుణులు డిమాండ్ చేశారు.

రైతుల్లో ఆత్మస్ధైర్యం కల్పించేందుకు..

ఈ గందరగోళ పరిస్థితుల్లో రైతుల్లో భరోసా నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వనగరం హైదరాబాద్‌... వ్యవసాయ పరిశోధన సంస్థలకు ఓ పెద్ద హబ్‌గా ప్రసిద్ధిగించిన దృష్ట్యా శాస్త్రవేత్తలందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మద్ధతు ఇస్తే అంతా గ్రామాలకు వెళ్లి రైతుల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details