కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గత మార్చి 22న మూతపడిన విద్యాసంస్థలు... తెరుచుకున్నాయి. పాఠశాలల్లో 9, 10 ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో బడిలో సందడి వాతావరణం నెలకొంది. దాదాపు పది నెలల తర్వాత పాఠశాలకు రావడంతో తోటి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఆనందానికి లోనయ్యారు. తల్లిదండ్రులే విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చారు.
ఆన్లైన్లోనూ
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆన్‌లైన్ లేదా టీవీల ద్వారా బోధన కొనసాగనుంది. 6 నుంచి ఎనిమిదో తరగతులకు 15 రోజుల తర్వాత బోధన ప్రారంభించేందుకు యోచిస్తుండగా... ఐదో తరగతి వరకు ఈ ఏడాది ప్రత్యక్ష బోధన లేకుండానే ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభమైనా కూడా ఆన్‌లైన్ బోధన కొనసాగించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు నిబంధన ఉండదని వెల్లడించింది.