రాష్ట్రంలో 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బడులు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలైంది. భౌతిక దూరం, శానిటైజర్, మాస్కు లాంటి నిబంధనలు పక్కాగా అమలు చేశారు. తల్లిదండ్రుల అనుమతిస్తున్నట్లు పత్రం ఉన్నవారినే తరగతులకు అనుమతించారు. అంగీకార పత్రంపై సంతకం తీసుకుని తరగతిగదిలోకి పంపించారు. మొదటి రోజు ఒంటి పూట మాత్రమే తరగతులు నిర్వహించారు. తరగతి గదుల నిర్వాహణకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసిన విద్యాశాఖ... అందుకనుగుణంగా విద్యాసంస్థల్లో ఏర్పాట్లు చేసింది. ప్రతి గదిలోనూ భౌతికదూరం పాటిస్తూ... 20 మంది విద్యార్థులకే తరగతులు నిర్వహించారు. మాస్క్ ధరించడం, థర్మల్‌స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువున్న విద్యార్థులను తిరిగి ఇంటికే పంపించారు. పది నెలల తర్వాత బడికి రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ, శివారాంపల్లి ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు.