School Bus Fitness : బడి బస్సుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే పిల్లల్ని ఎక్కించుకెళుతున్నారని వాపోతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు షెడ్డులకే పరిమితమైనా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించకుండానే తిప్పేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చాలా బస్సుల్లో బ్రేకుల వ్యవస్థ సరిగాలేదని.. కొన్నింటి కండిషన్ బాగాలేదని చెబుతున్నారు. స్కూళ్లు/కాలేజీలు ప్రారంభించిన తొలి రోజుల్లో రవాణా శాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి 170 వరకు బస్సులను సీజ్ చేశారని, పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. ఏటా మే మొదటి వారం నాటికే ధ్రువపత్రం తీసుకొనేవారు.
కారణమేంటి... కరోనా నేపథ్యంలో 2020 నుంచి బడి బస్సులు రోడ్డెక్కలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థలు బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతున్నాయి. ఈసారి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం రవాణా శాఖ వద్దకు వచ్చిన యాజమాన్యాలకు కొత్త చిక్కు వచ్చిపడింది. గత రెండేళ్లలో ఎన్ని రోజులకైతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోలేదో అన్ని రోజులకు రోజుకు రూ.50 చొప్పున జరిమానా చెల్లించాలని రవాణా శాఖ ఆదేశించింది.