School Academic Calender 2022-23: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2022-23) మొత్తం 230 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం విద్యా క్యాలెండర్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోజూ స్కూల్ అసెంబ్లీకి ముందు లేదా తర్వాత తరగతి గదిలో విద్యార్థులకు 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం నిర్వహించాలని ఆదేశించారు. ఈసారి 1-8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రతివారం ‘కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్’ పేరిట ఒక పిరియడ్‌ను నిర్వహిస్తారు. ఇందులో ఆంగ్ల పత్రికలు చదివించడం, కథలు చెప్పడం, కథల పుస్తకాలు చదవడం, డ్రామా, చిన్న నాటికలు వేయడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తారు. రోజూ విద్యార్థుల హాజరు 90 శాతానికిపైగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే జనవరి 10 నాటికి అన్ని తరగతులకు సిలబస్ పూర్తి చేస్తారు. 2020-21కి జాతీయస్థాయి ఇన్‌స్పైర్ పోటీలు జులై/ఆగస్టులో జరుగుతాయి. 2021-22 సంవత్సరానికి సెప్టెంబరు/అక్టోబరులో జిల్లా స్థాయి, నవంబరు/డిసెంబరులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు.
పరీక్షల కాలపట్టిక ఇదీ...
* ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1:జులై 21 నాటికి పూర్తి
* ఎఫ్‌ఏ 2:సెప్టెంబరు 5వ తేదీలోపు
* సమ్మేటివ్ అసెస్‌మెంట్-1:నవంబరు 1 నుంచి 7వ తేదీ వరకు
*ఎఫ్‌ఏ3:డిసెంబరు 21 నాటికి పూర్తి
* ఎఫ్ 4:పదో తరగతికి 2023 జనవరి 31 నాటికి, మిగిలిన వాటికి ఫిబ్రవరి 28 నాటికి
*ఎస్‌ఏ-2 :2023 ఏప్రిల్ 10 నుంచి 17వ తేదీ వరకు (1-9 తరగతులకు)
* పదో తరగతికి ప్రీ ఫైనల్ పరీక్షలు: 2023 ఫిబ్రవరి 28కి ముందు
* పదో తరగతి చివరి పరీక్షలు:2023 మార్చిలో
* చివరి పనిదినం: 2023 ఏప్రిల్ 24.