ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మార్కెట్లో పాఠ్యపుస్తకాలు దొరకడం లేదు. నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల ముద్రణపై ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాలేదు. విద్యా శాఖకు ముద్రణదారులు చెల్లించాల్సిన రాయల్టీపై వివాదం కొనసాగుతుండటమే ఇందుకు కారణం. అనేక ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించాయి. పుస్తకాలు లేక 6-10 తరగతుల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎన్ని దుకాణాల్లో అడిగినా తొమ్మిదో తరగతి పుస్తకాలు దొరకలేదని ఓ ప్రైవేట్ పాఠశాల యజమాని తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట తదితర పలు జిల్లాల్లోనూ లేవన్నారు. గత ఏడాది ముద్రించిన కొన్ని పుస్తకాలు అక్కడక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అదనపు సమాచారం పొందేందుకు అవసరమైన క్యూఆర్ కోడ్ లేదు. కొత్త పుస్తకాల్లోనే కోడ్‌ని ముద్రిస్తున్నారు.
గత ఏడాదివే అమ్ముడుపోలేదని..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1-10 తరగతుల విద్యార్థులకు విద్యాశాఖే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తోంది. 2021-22 విద్యా సంవత్సరానికి అవసరమైన 1.43 కోట్ల పుస్తకాల్లో 45 శాతం వరకు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ బడుల్లో రాష్ట్ర సిలబస్ చదివేవారు మార్కెట్లో పుస్తకాలు కొనుక్కోవాలి. ఏటా టెండర్ల ద్వారా ముద్రణదారుల (ప్రింటర్ల)కు ముద్రణ బాధ్యతలు అప్పగిస్తారు. గత విద్యా సంవత్సరం (2020-21)లో 6-10 తరగతుల టెండర్లు దక్కించుకున్న ముద్రణదారులు దాదాపు 1.28 కోట్ల పుస్తకాలకుగానూ 35 లక్షలు ముద్రించారు. వాటిలో కేవలం 18 లక్షలే అమ్ముడుపోయాయని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం మొత్తం 1.28 కోట్ల పుస్తకాలపై 5 శాతం రాయల్టీని వారు ప్రభుత్వానికి చెల్లించాలి. తాము ముద్రించిన పుస్తకాలన్నీ అమ్ముడుపోలేదని.. కరోనా పరిస్థితుల్లో రాయల్టీని రద్దు చేయాలని, గత ఏడాది టెండర్‌ను మరో ఏడాది పొడిగించాలని ముద్రణదారులు కోరుతున్నారు. ముద్రించిన పుస్తకాలకే రాయల్టీ తీసుకోవాలా? లేక కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కొత్త ఏడాదికి అది లేకుండా టెండర్లు ఇవ్వాలా? అన్న అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని ప్రభుత్వ పాఠ్యపుస్తక విభాగం అధికారి ఒకరు తెలిపారు.