వచ్చే వానాకాలం సీజన్‌లో రైతులకు రాయితీపై వ్యవసాయశాఖ ఇవ్వాల్సిన సోయా విత్తనాలకు కొరత ఏర్పడింది. గత వానాకాలం సాగు చేసిన సోయా చిక్కుడు విత్తన పంటలు చాలావరకూ దెబ్బతిన్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్ సీడ్స్) తనిఖీల్లో వెల్లడైంది. ఈ విత్తనాలను కొనేందుకు గత వానాకాలంలో ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి ‘ఉత్పత్తి టెండర్లు’ పిలిచింది. వీటిలో అర్హత పొందిన ప్రైవేటు కంపెనీలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో విత్తన పంటలు రైతులతో సాగు చేయిస్తున్నట్లు సంస్థకు తెలిపాయి. ఈ పంటలు నాణ్యతగా ఉన్నాయా అనేది తేల్చాలని వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఏపీలోని సోయా పైరును పరిశీలించింది. పంట సరిగా పండలేదని, విత్తనాలు నాణ్యంగా లేవని వ్యవసాయ శాఖకు నివేదించింది.
విత్తన వ్యథలు... ఈసారికి సోయా కష్టమే! - scarcity of soybean seeds in telangana
గత వానాకాలంలో సాగు చేసిన సోయా చిక్కుడు విత్తన పంటలు చాలా వరకు దెబ్బతినడం వల్ల వచ్చే వానాకాలం సీజన్‌కు రైతులకు రాయితీపై ఇవ్వాల్సిన సోయా విత్తనాలకు కొరత ఏర్పడింది. ఈ విత్తనాలు కొనేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రైవేట్ కంపెనీల నుంచి ఉత్పత్తి టెండర్లు పిలిచింది.
రాష్ట్రంలోనూ అదే పరిస్థితి
టీఎస్ సీడ్స్ సైతం ఉత్తర తెలంగాణలో రైతులతో సోయా విత్తన పంటను సాగు చేయించింది. పంటను నేరుగా కొంటామని రైతులతో ఒప్పందం చేసుకుంది. వర్షాలకు పంట పాడవ్వడంతో 5 వేల క్వింటాళ్లు కూడా రావని తేలింది. వీటి నాణ్యతను ప్రయోగశాలలో పరిశీలించగా సరిగా మొలకలు రావని తెలిసింది. వచ్చే వానాకాలంలో రైతులకు ఇవ్వడానికి 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా. ఇక మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని ప్రైవేటు కంపెనీల నుంచి కొనేందుకు మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో సోయాచిక్కుడు విత్తన పంట మెరుగ్గానే ఉందని ఇండోర్‌లోని ‘భారత సోయా చిక్కుడు పరిశోధన సంస్థ’ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. గత వర్షాకాలంలో టీఎస్ సీడ్స్ తరఫున సాగు చేయించిన విత్తన పంట వర్షాలకు పాడైన మాట వాస్తవమేనని విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు చెప్పారు.