తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రైవేటులో స్లాట్లు లేవు.. ప్రభుత్వంలో కిట్లు లేవు - scarcity of covid kits in Hyderabad

భాగ్యనగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తుంటే.. నిర్ధారణ పరీక్షలకు రోజుల తరబడి పడుతుండడంపై అనుమానితులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో కిట్ల కొరత నెలకొంది. వందలాది మంది వస్తుంటే 50 మంది నమూనాలే సేకరిస్తున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళదామంటే 10-15 రోజుల వరకు స్లాట్లు దొరకని పరిస్థితి. ఒకవేళ నమూనాలు తీసుకున్నా నాలుగు రోజుల వరకు ఫలితం చెప్పడం లేదు.

scarcity of covid kits, lack of corona kits, scarcity of corona kits in Hyderabad, Hyderabad news
హైదరాబాద్​లో కొవిడ్ కిట్ల కొరత, హైదరాబాద్​లో కరోనా కిట్ల కొరత, హైదరాబాద్​ న్యూస్, హైదరాబాద్​లో కరోనా వ్యాప్తి

By

Published : May 4, 2021, 9:50 AM IST

భాగ్యనగరంలోని 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు(యూహెచ్‌సీలు), శివార్లులోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీలు) ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కొద్దిమందికే పరిమితమవుతున్నాయి. కొన్ని యూహెచ్‌సీల్లో నిత్యం 50 ర్యాపిడ్‌, పది వరకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. మార్చి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండో విడతలో కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.

ప్రస్తుతం నిత్యం 2 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో నగరవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంచాల్సి ఉండగా ఆశ్చర్యంగా తగ్గిపోయాయి. పరీక్షలు సకాలంలో చేయకపోవడంతో చాలామంది నాలుగైదు రోజులు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చేసేది లేక లక్షణాలతో ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులందరూ వైరస్‌ బారిన పడుతున్నారు.

ఆలస్యమైతే తలెత్తుతున్న సమస్యలివి

సోమవారం నాడు వనస్థలిపురం, మెహిదీపట్నం, ఉప్పల్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట, మూసాపేట, చంపాపేట, మల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో నిరీక్షణ తప్పలేదు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. కిట్లకు కొరత లేదని అధికారులు చెబుతున్నా.. పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

చికిత్స అందడంలో తీవ్ర జాప్యమవుతోంది.

కరోనా లక్షణాలున్నా ఇతర అనారోగ్య సమస్యలు లేని వారు వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ కుదుటపడుతున్నారు.

కొవిడ్‌ లక్షణాలున్న కొందరిలో రెండో వారానికి ఆయాసం, ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరుతోంది. ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులు పాజిటివ్‌ రిపోర్టు ఉంటేనే చేర్చుకుంటున్నాయి. సరైన చికిత్సతో కొందరు కోలుకుంటున్నప్పటికీ.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

రెండో దశలో జలుబు చేసి జ్వరం మోస్తరుగా ఉన్నా, కొవిడ్‌గానే అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లక్షణాలు పెరుగుతుంటే వైద్యుణ్ని సంప్రదించాలని, వారి సూచన మేరకు మందులు వాడితే మేలని సూచిస్తున్నారు. ఆలస్యమైనా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరిగా చేయించుకొని వైరస్‌ ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, చికిత్స పొందడం ద్వారా ప్రాణాల మీదకు రాకుండా చేసుకోవచ్చని వివరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details