ఎక్కడైనా సరే.. ఎస్సీలపై అఘాయిత్యాలు జరిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేసి నిందితులపై కేసు నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటరున్నర దూరంలో కృష్ణా నదీ తీరంలోని సీతానగరం పుష్కర్‌ఘాట్ సమీపంలో విజయవాడకు చెందిన ఎస్సీ యువతిపై అత్యాచార ఘటన(tadepalli rape case)కు సంబంధించి నమోదు చేసిన కేసులో గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అలా చేయలేదు.
బాధిత యువతి ఎస్సీ వర్గానికి చెందినప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను వర్తింపజేయలేదు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో నమోదు చేసిన క్రైం నంబరు 697/2021లో ఐపీసీలోని 342, 376-డీ, 384, 323, 506 రెడ్‌విత్ 34 సెక్షన్లను పెట్టారు. అక్రమ నిర్బంధం, అత్యాచారం, బెదిరింపు, దాడి, కొందరు కలిసి నేరపూరిత బెదిరింపునకు పాల్పడటంవంటి అభియోగాలను మోపారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను ఈ కేసులో వర్తింపజేస్తే కేసు తీవ్రత పెరగటంతోపాటు దోషులకు ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు అలా చేయలేదు.