ఏపీ విశాఖ జిల్లాలో శిరోముండనం కేసుకు సంబంధించి.. సినీ నటుడు, నిర్మాత నూతన్‌నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇంట్లో ఐఫోన్ పోయిందన్న కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిచి నూతన్ నాయుడు కుటుంబీకులు శిరోముండనం చేయించారు. ఈ దాడి వెనక నూతన్‌నాయుడు ప్రమేయంపై ఆరా తీస్తున్నామని సీపీ పేర్కొన్నారు. నిందితుడ్ని కర్నాటకలోని ఉడిపిలో అరెస్ట్ చేశామని… ఆయన దగ్గర మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
అనుమతి కోరాం...
కర్ణాటక పోలీసులు అతడిని ఓ కోర్టులో హాజరుపరిచారని.. అక్కడి నుంచి తమ కస్టడీకి తీసుకునేందుకు అనుమతి కోరుతున్నామని వివరించారు. అలాగే... రిటైర్డ్ ఐఏఎస్ పీవి.రమేష్ పేరిట కొంతమందికి కాల్ చేసి… తన సొంత పనులు చేసుకోవాలని నూతన్‌నాయుడు ప్రయత్నించినట్లు సీపీ వివరించారు.