అసలు ఉనికిలోనే లేని చట్టం కింద ఎవరైనా కేసులు నమోదు చేస్తారా? చేస్తే అవి చెల్లుతాయా? ఈ ప్రశ్నలు ఎవరిని అడిగినా లేదనే సమాధానం వస్తుంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం.. ఆరేళ్ల క్రితమే రద్దయిన చట్టం కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఒకటో రెండో కాదు.. 38 కేసులు పెట్టారు. వాటిలో 19 న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఆరేళ్ల కిందట సుప్రీంకోర్టు ప్రకటించింది. దాన్ని రద్దుచేస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఆ తర్వాత కూడా ఆ సెక్షన్ కింద పలువురిపై కేసులు పెట్టారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై ఈ సెక్షన్‌ను ప్రయోగించారు. ఈ సెక్షన్ కింద ఇకపై ఎలాంటి కేసులు పెట్టొద్దని, గతంలో నమోదుచేసిన వాటిని ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకూ తాజాగా ఆదేశాలివ్వడంతో ఈ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది.
ఉదంతాలివి
- ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన రాజేష్‌నాయుడిపై 2019 జులై 7న అక్కడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బి.నరసింహారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టారు.
- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారంటూ సయ్యద్ హుస్సేన్, నయబ్ రసూల్, సజ్జా అజయ్ చౌదరి తదితరులపై 2020 ఫిబ్రవరి 29న మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
- అంతకు ముందు 2015-19 మధ్య కూడా ఈ సెక్షన్ కింద పలువురిపై కేసులు నమోదయ్యాయి.
కర్ణాటక హైకోర్టు తీర్పు తర్వాత కూడా..
- రద్దయిన ఐటీ చట్టంలోని సెక్షన్-66ఏ కింద కేసులు నమోదు చేసినందుకు 2020 జనవరి 17న కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనమైంది
- ఆ తర్వాత కూడా ఏపీలో కొందరిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ గతేడాది ఫిబ్రవరిలో నమోదైన కేసు ఆ తీర్పు తర్వాత పెట్టిందే.
ఐటీ చట్టం-66ఏ ఏం చెబుతోంది...
- కంప్యూటర్ పరికరాలు, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపితే శిక్షించేందుకు ఈ సెక్షన్ వీలు కల్పిస్తుంది. నేరం నిరూపణైతే మూడేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించొచ్చు. ఐటీ చట్టం 2000కు సవరణ చేసి 2008లో దీన్ని తీసుకొచ్చారు. 2009 అక్టోబరు 27 నుంచి అమల్లోకి వచ్చింది.
- దీన్ని సవాలు చేస్తూ న్యాయవాది శ్రేయా సింఘాల్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలుచేశారు. ఈ సెక్షన్ కింద నమోదుచేసిన కేసుల్లో సీనియర్ పోలీసు అధికారుల ఆమోదం లేకుండా అరెస్టు చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ)లో పేర్కొన్న భావప్రకటన స్వేచ్ఛకు ఈ సెక్షన్ విఘాతం కలిగిస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని 2015 మార్చి 24న సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ సెక్షన్‌ను రద్దుచేసినట్లు వెల్లడించింది.