కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం కఠిన నిబంధనలు విధించడంతో, ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్టు రూపంలో వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు ఏకైక నోడల్ ఖాతాలు బ్యాంకులో తెరుస్తున్నందున కేంద్రం ఇచ్చే మొత్తాన్ని ఆసరాగా చేసుకుని.. ఆ మేరకు ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు ఇవ్వాలని ఏపీ ఆర్థికశాఖ కోరుతోంది.
ఏపీ ప్రభుత్వం అడిగిన రూ.6,500 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వడం సాధ్యం కాదని ఈ పథకాలకు సింగిల్ నోడల్ ఏజన్సీగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా(sbi rejected od facility for 6500 crores requested by state government) కుండ బద్దలు కొట్టింది. ఈ మేరకు ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఎస్‌బీఐ తాజాగా లేఖ రాసింది. ‘కేంద్ర ప్రాయోజిత పథకాల సింగిల్ నోడల్ ఖాతాలు మీ బ్యాంకులో తెరుస్తాం. ఈ పథకాలకు అవసరమైన మూలధన పెట్టుబడి రూ.6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో కల్పించాలి.
ఈ పథకాల అమలుకు ఏర్పాటుచేసిన అయిదు ఏజన్సీలకు ఆ నిధులు ఓడీగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. ఆ ఖాతాల్లో వినియోగించుకోగా మిగిలిన నిధులను సెక్యూరిటీగా భావిస్తూ ఈ మేరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలి’ అంటూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సెప్టెంబరు 2న ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వారు ఆ లేఖను పరిశీలించిన తర్వాత అలా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. బ్యాంకు నిబంధనలు ఇందుకు అనుమతించబోవని తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు ఇలా ఓడీ సౌకర్యం కల్పించే అవకాశం లేదన్నారు. నోడల్ ఖాతాలు తెరిచేందుకు ఖజానాతో సంబంధం ఉన్న గుంటూరు, విజయవాడల్లోని ఏ బ్యాంకు శాఖనైనా సంప్రదించవచ్చని తెలిపారు. ఓడీ వెసులుబాటు అనుసంధానంతో ఏ మాత్రం సంబంధం లేకుండానేఈ ఖాతాలు తెరవాలని ఎస్‌బీఐ సూచించింది.
ఇప్పుడేం చేయాలి?