70 ఏళ్ల వయసులోనూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వయంగా పనులు చేసుకుంటూ.... 'అతడు'లా కనిపిస్తున్న 'ఆమె' పేరు సావిత్రి. వేషధారణ, ఆమె పనులు చేసే విధానం చూసి ఎవరైనా పురుషుడే అనుకుంటారు. ఆడపిల్లగా పుట్టి... మగరాయునిలా ఆమె మారటానికి పేదరికమే కారణం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరిజిల్లా ఉంగటూరు మండలం నీలాద్రిపురానికి చెందిన సావిత్రి .. ఆరుగురు సంతానంలో నాల్గో కుమార్తె. అందరూ ఆడపిల్లలే పుట్టడంతో... సావిత్రి తల్లి... ఆమెను మగపిల్లానిలా తయారు చేసి ముచ్చట తీర్చుకునేది. అలా చిన్నప్పుడే ఇంటికి మగదిక్కులా మారిన సావిత్రి... జీవితాంతం ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పూర్తిగా మగరాయునిలా మారింది.
బంధాన్ని వదిలి...
14వ ఏటనే చొక్కా, నిక్కరు వేసిన సావిత్రి... వయసులో ఉన్న ఆడపిల్ల అటువంటి బట్టలు వేయటమేంటని బంధువులు హేళన చేసినా పట్టించుకోలేదు. కుటుంబాన్ని పోషించాలంటే అన్ని పనులూ చేయాలని నిర్ణయించుకున్న ఆమె...అన్ని పనులూ మగాళ్లతో సమానంగా చేసేది. ఆ కూలి డబ్బులతోనే కుటుంబాన్నిపోషించింది. తల్లిదండ్రుల మరణం తరువాత... ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిలు ఆమె చేసింది. పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా... సావిత్రి ఏ మాత్రం మారలేదు. కుటుంబం కోసం వివాహ బంధాన్నీ వదిలేసింది. తన సోదరి మూగది కావటం వల్ల ... భర్త వదిలేశాడు. అప్పటి నుంచీ ఆమెను సావిత్రే పోషించింది. ఇటీవలే ఆ సోదరి మరణించింది.