శ్రీవారి సర్వదర్శన టోకెన్లను తితిదే ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది. ఇది తెలియని చాలా మంది భక్తులు.. తిరుమల టికెట్ కౌంటర్ల దగ్గర బారులు తీరారు. టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో భక్తులంతా నిరసనకు దిగారు. ఆన్‌లైన్‌లో ప్రవేశపెడుతూ తితిదే తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.
శ్రీవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సర్వదర్శనం టోకెన్ల జారీపై తిరుపతిలో నిరసనకు దిగారు. సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో ప్రవేశపెడుతూ తితిదే తీసుకొన్న నిర్ణయంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరోనా రెండో దశ తీవ్రత తగ్గిన తర్వాత ఈ నెల 8 నుంచి సర్వదర్శనం టికెట్లను తిరుపతిలో జారీచేస్తోంది. ప్రయోగాత్మకంగా తొలుత రోజుకు 2 వేల టికెట్లను జారీ చేసిన తితిదే.. తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా టికెట్ల సంఖ్యను రోజుకు 8 వేలకు పెంచింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సర్వదర్శనం టికెట్ల కోసం వస్తున్న భక్తుల సంఖ్య పెరగడం...రద్దీ అధికమవడంతో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయం తెలియని భక్తులు తిరుపతికి చేరుకొని సర్వదర్శనం టోకెన్ల కోసం నిరసనకు దిగారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో లేవని ఆందోళన చేపట్టారు.
రాష్ట్రాలు దాటి
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడంపై భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు, తెలంగాణ నుంచి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. తొలుత రోజుకు 8 వేల టికెట్లు కేటాయిస్తామని తితిదే ప్రకటించింది...అయితే ఉన్నట్లుండి ఆ టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని చెప్పడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.