తెలంగాణ

telangana

ETV Bharat / city

నిధులు లేక.. పండ్లు, కొబ్బరిబోండాలు అమ్ముకుంటున్న సర్పంచ్..! - పండ్లు అమ్ముకుంటున్న సర్పంచి

Sarpanch sells fruits: గ్రామ పంచాయతీలో నిధులు లేవు. ఉన్న నిధులన్నీ విద్యుత్‌ బిల్లుల పేరుతో ప్రభుత్వమే తీసుకుంది. ఆ తర్వాత పంచాయతీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో సర్పంచ్‌కు ఏం చేయాలో తోచడం లేదు. నిధుల కొరతతో అభివృద్ధి పనులు ఎలా చేయాలో అర్థం కావడం లేదు. గ్రీన్‌ అంబాసిడర్‌లకు జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలో తెలియట్లేదు. అధికారులెవరూ స్పందించడం లేదు. దీంతో ఏ మార్గం లేక.. పండ్లు, కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ గ్రామానికి చిన్న చిన్న అవసరాలు తీరుస్తున్నారు ఈ సర్పంచ్‌..

Sarpanch sells fruits
బోండాలు అమ్ముకుంటున్న సర్పంచ్‌

By

Published : May 16, 2022, 1:12 PM IST

Sarpanch sells fruits: గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న సొమ్మును ప్రభుత్వం తీసుకోవడంతో పనులు చేయడానికి నిధులు లేవని, ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వట్టిచెరుకూరు సర్పంచ్‌ ఆరమళ్ల విజయ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి సొమ్ము లేకపోవడంతో పంచాయతీ కార్యాలయానికీ వెళ్లడం లేదని తెలిపారు.

గ్రామస్థులు తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే వారి సమస్యలను తీర్చడానికి రూ. 6 లక్షలు అప్పు తెచ్చి వివిధ పనులు చేశానని, ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని విజయ్‌ చెప్పారు. గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న ఆర్థిక సంఘం నిధులు రూ.17 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లుల కింద జమ చేసుకుందని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న బకాయిలను ఒకేసారి జమ చేసుకుంటే పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు.

గ్రామంలో గ్రీన్‌ అంబాసిడర్‌లకు 9 నెలలుగా జీతాలు రాకపోవడంతో వారి అవసరాలకు జేబు నుంచి సొమ్ము చెల్లిస్తున్నానని విజయ్‌ అన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిన రాష్ట్రం.. కేంద్రం ఇచ్చిన నిధులు తీసేసుకుంటే తామేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం కావడంతో కొబ్బరి బోండాలు, పండ్లు అమ్ముకుంటున్నానని చెప్పారు.

‘మేజరు పంచాయతీ అయిన మా గ్రామంలోనే 3 గంటలు కరెంటు ఉండటం లేదు. చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రి పూట ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో సొమ్ము లేకపోతే దోమల మందు, శానిటైజేషన్‌ ఎలా చేయాలి. పైపులైను లీకేజీలు ఎలా అరికట్టాలి’ అని విజయ్‌ కుమార్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'సరదాగా మొదలెడితే వ్యసనంగా మారుతోంది.. జీవితాలను ఆగం చేస్తోంది'

మా వాట్సప్‌ గ్రూప్‌నకూ ఆ పేరే పెట్టాం: కిదాంబి శ్రీకాంత్‌

బర్త్‌డే పేరుతో.. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

ABOUT THE AUTHOR

...view details