Village Secretary Controversial Notice: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. వన్‌టైమ్ సెటిల్మెంట్ డబ్బులు కట్టని వారికి పింఛన్ ఇవ్వొద్దని వాలంటీర్లను ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. వాలంటీర్లు ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా ఆ మొత్తం వసూలుకు వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఓటీఎస్ డబ్బులు చెల్లించాల్సిన వారి కుటుంబీకుల పింఛను నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు, వారిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ వివరాలను వాలంటీర్లు సేకరించి డిజిటల్ అసిస్టెంట్‌కి ఇవ్వాలని ఆదేశించారు. ఎంపీడీవో మౌఖిక ఆదేశాల మేరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు నోటీసుల్లో పేర్కొనటం గమనార్హం.
Action on Santhabommali Village Secretary: ఓటీఎస్‌పై సర్క్యులర్ జారీ చేసిన సంతబొమ్మాలి గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సంబంధిత ఎంపీడీఓకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ సర్క్యులర్ వెనుక కుట్ర కోణం ఉందని.. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పేదలకు మేలు చేస్తున్న ఓటీఎస్‌ను అడ్డుకునేందుకే ఈ తరహా సర్క్యులర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు భరోసా కల్పించేలా ఇళ్లపై హక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు.