సంక్రాంతిని పెద్ద పండుగగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంటలే ప్రధాన ఆదాయ వనరులైన రైతుల చేతికి పంట వచ్చేది ఈ రోజుల్లోనే. ఈ కారణంగానే సంక్రాంతిని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ ఇళ్ల ముందు రకరకాల రంగులతో రంగవల్లులు వేస్తారు.
ఉత్తరాయణంలోకి..
సంక్రాంతి అంటే నూతన కాంతి అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడమే సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భానికి... సంక్రమణం అని అర్థం వస్తుంది. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఇలా పుణ్యకాలం ప్రారంభం పండుగలా చేయడాన్ని తెలుగు వాళ్లు అనాదిగా శుభప్రదంగా భావిస్తున్నారు. ఆనవాయితీగా పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఉంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పండుగగా అభివర్ణిస్తారు.