హైదరాబాద్ మహానగరం అంటేనే ఉరుకులు పరుగుల జీవితం. తెల్లవారు లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు అంత హడావుడే. ఏడాదంతా తీరిక లేకుండా గడిపినా.... తెలుగింటి పండుగ సంక్రాంతి వచ్చిందంటే సొంతూళ్లకు చేరుకుంటుంటారు. కానీ నగరంలో ఉండేవారికి పల్లె అందాలను కళ్లకు కడుతోంది మాదాపూర్ శిల్పారామం. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ఎటుచూసిన మనసుకు ఉల్లాసాన్ని కల్గించే పచ్చనిచెట్లు, ఎద్దుల బండ్లు, బోటు షికారు... ఇలా ఎన్నో కార్యక్రమాలు కనువిందు చేస్తున్నాయి. కుటుంబ సమేతంగా వస్తూ... బాల్యస్మృతులను నెమరువేసుకుంటున్నారు.
శిల్పారామంలో సంక్రాంతి సందడి.. ఉట్టిపడిన పల్లె వాతావరణం - సంక్రాంతి సంబరాలు
ఆహ్లదం పంచే ప్రకృతి అందాలు. హరిదాసుల రామకీర్తలు, గంగిరెద్దుల విన్యాసాలు. ఇలా... పల్లెటూరి అనుభూతులను నగరవాసులకు అందిస్తోంది... హైదరాబాద్‌లోని శిల్పారామం. తెలుగింటి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని... శిల్పారామం సందర్శకులతో సందడిగా మారింది. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఇక్కడికి వస్తూ... సొంతూళ్ల అనుభూతులను పంచుకుంటున్నారు.
పట్టణ వాతావరణానికి అలవాటుపడి... పల్లె జీవనానికి దూరమైన వారందరికీ శిల్పారామం చక్కటి అనుభూతిని పంచుతోంది. సంక్రాంతి సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రత్యేక ఆటాపాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఉండే ఎద్దులబండ్లు, హరిదాసులు, బసవన్న విన్యాసాలు, లోగిళ్లలో రంగవళ్లులు, బంతిపూలతో ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి.జాతరను తలపించే క్రాఫ్ట్‌బజార్, బోటు షికార్లు చేస్తూ... కేరింతలు కొడుతున్నారు. కరోనాతో నెలల తరబడిగా ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో... ఇక్కడికి రావటం ఉపశమనాన్నిస్తోందని నగరవాసులు చెబుతున్నారు. జనసందోహం పెరుగుతున్నందున కొవిడ్ నిబంధనలతో నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లలేదని దిగులును శిల్పారామం తీర్చినట్లు సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
ఇదీ చూడండి:అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు