తెలంగాణ

telangana

ETV Bharat / city

అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే మహిళలు ఇంటి ముందు అలికి రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గాలి పతంగులు ఎగురవేస్తూ సంబురాలు చేసుకున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

sankranthi
sankranthi

By

Published : Jan 14, 2021, 7:23 PM IST

Updated : Jan 14, 2021, 9:07 PM IST

అంబరాన్నంటిన సంబురాలు... కిటకిటలాడిన ఆలయాలు

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు పండుగను వైభవంగా జరుపుకొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేశారు. అనంతరం రంగవల్లికల నడుమ గొబ్బెమ్మలను కొలువుదీర్చి నవధాన్యాలతో పూజలు చేశారు. అటు నగరంలోని పలు కాలనీలు రంగురంగుల ముగ్గులతో విశేషంగా ఆకట్టుకున్నాయి. ములుగు పట్టణంలో మహిళలు తెల్లవారుజామునే వాకిటి ముంగిట తీరొక్క రంగులతో ముగ్గులు వేసి పరవశించిపోయారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌లో హరివిల్లుల్లాంటి రంగవల్లులు, సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు, డూడూ బసవన్నల విన్యాసాలు, గొబ్బెమ్మల ఆట పాటలతో సందడి వాతావరణం ఏర్పడింది.

ముగ్గుల పోటీలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లునాయక్ తండాలో ఉద్యోగుల పొదుపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు యువతులు, మహిళలు పోటెత్తారు. రంగురంగులతో వేసిన ఆకర్షణీయమైన ముగ్గులు ఆకట్టుకున్నాయి. పోటీలో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్‌లోని పలు కాలనీల్లో మహిళలు... తమ ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి మురిసిపోయారు. పెద్దపెల్లి జిల్లా మంథని మండలం బోయిన్‌పేటలో లక్ష్మీదేవి బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. ఏటా సంక్రాంతి రోజు ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. డప్పుచప్పుళ్లు, భక్తుల కేరింతలు, కృష్ణస్వామి, పోతరాజు నృత్యాలు, శివసత్తుల పూనకాలతో వేడుక ఆద్యాంతం ఉత్సాహాభరితంగా సాగింది.

దేవాలయాలకు పొటెత్తిన భక్తులు

నిజామాబాద్ జిల్లాలో పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. మహిళలు, యువతులు ఇళ్ల ముందు అందమైన రంగవల్లులను అలంకరించారు. చిన్నారులు పతంగులు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు... స్వామివారిని దర్శించుకున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో ఉన్న రామేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయం సమీపంలోని చెట్టు వాగులో నిర్మించిన 36 అడుగుల శివుడి విగ్రహాన్ని చూసేందుకు బారులు తీరారు. యువత స్వీయచిత్రాలు దిగుతూ, స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు.

ఆకట్టుకున్న బొమ్మల కొలువు

సంక్రాంతి సంబురాలను భాగ్యనగర వాసులు అట్టహాసంగా జరుపుకొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా... నారాయణగూడలోని మేల్కొటి పార్క్ వాకర్స్ సంక్షేమ సంఘం నాయకులు వేడుకలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలతో సందడి చేశారు. సినీనటుడు అమిత్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌... తన ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. సనాతన సాంప్రదాయం ప్రకారం దేవుళ్లు, పెళ్లిపందిరి తదితర అంశాలపై బొమ్మలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :పందెం కోడి కాలు దువ్వింది.. బరిలోకి దునికింది!

Last Updated : Jan 14, 2021, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details