మహానగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటిదశలో 1100 కి.మీ రోడ్ల పారిశుద్ధ్య బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించేందుకు నడుం బిగించింది. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆ రోడ్లపై రోజుకు రెండుసార్లు చెత్త ఊడ్చడం.. అలానే ఇంటింటా తడి, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరణ.. నిర్మాణ వ్యర్థాలు, చెట్ల కొమ్మలను నిత్యం తొలగించడం.. ప్రతి 100-200 మీటర్లకు తడి, పొడి చెత్త డబ్బాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అందులో భాగం. త్వరలో సంబంధిత పనులు మొదలుకానున్నాయి.
తగ్గిన సీజనల్ వ్యాధులు..
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించిన పలు కార్యక్రమాలతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని జీహెచ్‌ఎంసీ గురువారం ప్రకటించింది. ‘‘జూన్‌లో నగరవ్యాప్తంగా 2611 ఖాళీ స్థలాల్లోని 9269 మెట్రిక్‌టన్నుల చెత్తను, 29,029 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను, 6308 మెట్రిక్ టన్నుల నాలా పూడిక తొలగించాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, 10 నిమిషాలపాటు ప్రజలంతా ఇంట్లోని అనారోగ్యకర పరిస్థితులను చక్కదిద్దాలని ఇచ్చిన పిలుపు విజయవంతమైంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, చౌమొహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, ఇతరత్రా 25కు పైగా పర్యాటక ప్రాంతాల పారిశుద్ధ్య బాధ్యతలను ప్రైవేటీకరించాం. అక్కడున్న 71 కి.మీ పొడవైన రోడ్ల పొడవునా 24 గంటలూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తుండగా దోమల తీవ్రత తగ్గింది. అందుకు ఏటా రూ.27 కోట్లు వెచ్చిస్తున్నాం. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో చెత్తను మండించి 19.8 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటు, జీడిమెట్లలో 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను నిర్వహించే కేంద్రం సేవలకు సిద్ధమయ్యాయి.’’ అని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.
ఇంకా ఏం చేస్తారంటే..
- ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉండే 1100 కి.మీ రోడ్లపై భవిష్యత్తులో చెత్త సేకరణ రుసుము, ఇతరత్రా ఆదాయ వనరులను సమకూర్చుకుని, పౌరులను స్వచ్ఛతలో భాగస్వామ్యం చేస్తారు.
- ఈ రోడ్లపై ప్రైవేటు ఏజెన్సీలు పారిశుద్ధ్య బాధ్యతను తీసుకుంటే, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న బల్దియా కార్మికులను చుట్టుపక్కల ప్రాంతాలకు కేటాయిస్తారు.
- కేటాయించిన రోడ్లపై అపరిశుభ్రత ఉంటే దానికి కారణమైన ఏజెన్సీలు, పౌరులకు భారీ జరిమానా విధిస్తారు. సంబంధిత తీర్మానాన్ని గురువారం బల్దియా స్థాయీ సంఘ సమావేశంలో ఆమోదించారు.
చెత్త సేకరణ మరింత పటిష్ఠంగా...
తడి, పొడి వ్యర్థాలకు మూసి ఉండే గదులతో కూడిన ట్రాలీని స్వచ్ఛ ఆటోలు ఏర్పాటుచేయాలని బల్దియా నిర్ణయించింది. కొత్తగా తీసుకునే ఆటోలకూ ఇవే ఉంటాయి. అన్నీ అందుబాటులోకి వస్తే ప్రతీ ప్రాంతంలో రెండు రోజులకోసారి వ్యర్థాల సేకరణ ఉంటుంది.. ఇళ్లలో చెత్తను రోడ్డుపై వేసే సంప్రదాయాన్ని నిర్మూలిస్తామని, తరలింపు కేంద్రాలను ఆధునికీకరిస్తామని చెబుతున్నారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు వ్యర్థాల తరలింపునకు కంటైనర్ల తరహా ట్రక్కులను ఉపయోగిస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిస్థితిని చక్కదిద్దుతామని పారిశుద్ధ్య విభాగం చెబుతోంది.
ఇదీ చదవండిఃశనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు