అది 2020 డిసెంబరు 30. చెన్నైలో టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ అనే సంస్థ ఊపిరి పోసుకుంది. వారం తిరక్కముందే 2021 జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏదైనా కేంద్ర సంస్థకు గానీ, అవి ముందుకు రాకపోతే వేలం ద్వారా ఏదైనా ప్రైవేటు సంస్థకు గానీ అప్పగించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లకే గనుల శాఖ టెండర్లు పిలిచింది. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలోనూ, మధ్యప్రదేశ్‌లోని నిగ్రీలోను రిజిస్టర్డ్ చిరునామాలు, దిల్లీలో కార్పొరేట్ కార్యాలయం ఉన్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు దక్కించుకుంది.
తర్వాతే అసలు కథ మొదలైంది. టెండర్ దక్కించుకున్న జేపీ సంస్థ ప్రతినిధులు గానీ.. ఉద్యోగులు గానీ ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పెద్దగా నిమగ్నమవలేదు. జేపీ పవర్ వెంచర్స్‌కి సబ్ కాంట్రాక్టర్‌గా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ రంగంలోకి దిగింది. తమిళనాడు నుంచి వందల మంది కార్మికులను, ఉద్యోగులను ఇసుక రేవుల్లో, స్టాక్ పాయింట్లలో మోహరించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వ్యాపారమంతా ఆ సంస్థ గుప్పిట్లోనే ఉంది. అది ఆడిందే ఆట.. పాడిందే పాట.. అది ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డా.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అటువైపు కన్నెత్తి చూడదు. ఇప్పుడు అర్థమైంది కదా..! టర్న్‌కీ సంస్థ ఏర్పాటుకు.. ఆ తర్వాత వారం రోజులకే ఇసుకను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడానికి మధ్య సంబంధమేంటో.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా దొరికిన ఇసుకను.. వైకాపా ప్రభుత్వం పక్కా వ్యాపార వస్తువుగా మార్చేసింది. ఇసుక బంగారంగా మారిపోయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక.. అప్పటి వరకూ అమల్లో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. 2019 సెప్టెంబరులో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు జరిపింది. ఆ తర్వాత మరో కొత్త విధానం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ 2021 జనవరిలో నివేదిక ఇవ్వడం.. ఆ వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దానికి వారం రోజుల ముందుగా చెన్నైలో టర్న్‌కీ సంస్థ ఏర్పాటవడం.. అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పేరుకే జేపీ సంస్థ..! :రాష్ట్రంలో గత ఏడాది ఆరంభంలో మూడు జోన్లుగా పిలిచిన ఇసుక టెండర్లను ఉత్తరాదికి చెందిన జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం గత ఏడాది మే 14 నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాలు మొదలయ్యాయి. తమిళనాడుకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. వారంతా ఎవరని ఆరా తీయగా... టర్న్ కీ ఎంటర్‌ప్రైజ్ పేరు తెరపైకి వచ్చింది. జేపీ సంస్థ ప్రమేయం కొంతేనని, కర్త.. కర్మ.. క్రియ.. అన్నీ టర్న్‌కీ సంస్థేనని అర్థమైపోయింది. కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ వివరాల ప్రకారం.. టర్న్‌కీ సంస్థ చిరునామా చెన్నైలోని పురసయివాక్కంలో ఉంది. దండపాణి పళనిస్వామి, బోసాని శ్రీనివాసరెడ్డి, బోసాని రవికాంత్‌రెడ్డి అందులో డైరెక్టర్లు. వారిలో పళనిస్వామి 2020 డిసెంబరు 30 నుంచి డైరెక్టర్‌గా ఉండగా.. శ్రీనివాసరెడ్డి, రవికాంత్‌రెడ్డి మాత్రం గత ఏడాది డిసెంబరు 7 నుంచి డైరెక్టర్లుగా చేరారు. ప్రభుత్వం గత ఏడాది ఇసుక టెండర్లకు సన్నాహాలు చేస్తున్నప్పుడే.. వాటిని చెన్నైకి చెందిన ఒక మైనింగ్ వ్యాపారికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. చివరకు జేపీ సంస్థ టెండర్లు సొంతం చేసుకున్నా.. చెన్నైకి చెందిన టర్న్‌కీ సంస్థే మొత్తం ఇసుక తవ్వకాలు, విక్రయాలు నిర్వహిస్తుండటం విశేషం.
అంతా వారి కనుసన్నల్లోనే..:గతంలో ఇసుక తవ్వకం, విక్రయాలను ఏపీఎండీసీ నిర్వహించినప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 2 వేల మంది స్థానికులకు ఉపాధి దొరికేది. ఇప్పుడు టర్న్‌కీ సంస్థ స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లు, నిల్వ కేంద్రాల్లో ఇసుక లోడింగ్ లెక్కలు రాయడం, డబ్బులు వసూలు చేయడం వంటి పనులన్నీ తమిళనాడుకు చెందిన వారే చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ 75% స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా.. ఇసుక తవ్వకాలు, విక్రయాల పనుల్లో అది అమలవడం లేదు. టర్న్‌కీ సంస్థ తమిళనాడుకు చెందిన వారిని, ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన తెలుగు మాట్లాడే వారిని తీసుకొచ్చి పనిలో పెట్టుకుంది. ఏపీఎండీసీ హయాం నుంచి పని చేస్తున్న వారిలో చాలా కొద్దిమందిని అక్కడక్కడా కొనసాగిస్తోంది.
రూ.కోట్లలో లావాదేవీలు :గనుల శాఖ లెక్కల ప్రకారం రోజుకు సగటున 54 వేల టన్నుల చొప్పున, ఏటా సుమారు రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. టన్ను రూ.475 చొప్పున ఏడాదికి రూ.950 కోట్ల ఆదాయం వస్తోంది. రూ.475 రీచ్‌లో ధర మాత్రమే. స్టాక్ పాయింట్లు ఉన్నచోట రవాణా ఛార్జీలు కలిపి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చే నగదులో టన్నుకు రూ.375 చొప్పున గుత్తేదారు సంస్థ ప్రతి 15 రోజులకు ప్రభుత్వ ఖజానాకు బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేస్తోందని అధికారులు చెబుతున్నారు.