తెలంగాణ

telangana

ETV Bharat / city

Sand Mafia: ఇసుకను దోచేస్తున్న అక్రమార్కులు.. అడ్డగిస్తే దాడులే.! - ఇసుకను కొల్లగొడుతున్న అక్రమార్కులు

వరద నీటిలోనూ ఇసుకను దోచేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మామూళ్లతో అధికారులను మచ్చిక చేసుకుంటూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. భారీగా వస్తున్న అక్రమ ఆదాయాన్ని వదులుకునేందుకు ఇష్టపడని అక్రమార్కులు అడ్డొచ్చినవారిపై భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో పెద్దవాగు నుంచి ఇసుక అక్రమరవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను గాయపరచిన ఘటన ఇసుక దందాకు నిలువెత్తు సాక్ష్యం.

Sand Mafia
వరద నీటిలోనూ ఇసుకను దోచేస్తూ అక్రమార్కులు

By

Published : Aug 3, 2021, 5:03 AM IST

Updated : Aug 3, 2021, 6:28 AM IST

నదీతీర ప్రాంతాలు, వాగుల సమీప ప్రాంతాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. వరదనీటిలోనూ వదలకుండా ప్రకృతి సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ఇసుక సరఫరాకు ఏజెంట్ల వ్యవస్థ వేళ్లూనుకుంది. అనేకచోట్ల అధికారులకు తెలిసే ‘మామూలు’గా ఈ దందా సాగుతోంది. కొన్నిచోట్ల అధికారులు కట్టడికి ప్రయత్నిస్తున్నా.. బెదిరింపులు, దాడులకు గురవుతున్నారు. భారీగా వస్తున్న అక్రమ ఆదాయాన్ని వదులుకునేందుకు ఇష్టపడని అక్రమార్కులు అడ్డొచ్చినవారిపై భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో పెద్దవాగు నుంచి ఇసుక అక్రమరవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను గాయపరచిన ఘటన ఈ కోవకు చెందినదే. గ్రామాల మధ్య ఇసుక ఆదాయం చిచ్చురేపుతోంది. గద్వాల జిల్లా ఇసుకదందాలో కమీషన్‌ ఏజెంట్ల వ్యవస్థది కీలకపాత్ర. టిప్పర్‌ ఇసుకకు రూ.3 వేల కమీషన్‌ తీసుకుంటున్నారు. అక్రమాల్ని అరికట్టే కీలకశాఖ సిబ్బందికి టిప్పర్‌కు రూ.5-7వేల మామూళ్లు ముడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ట్రాక్టర్‌ యజమాని నుంచి నెలకు రూ.15వేలు అందుతున్నట్లు సమాచారం. మక్తల్‌, మాగనూరు మండలాల్లో సంగంబండ వాగు నుంచి ఏడాదంతా అక్రమ రవాణా సాగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, పెద్ద టిప్పర్లలో ప్రకృతి సంపద తరలిపోతోంది. ఒక ట్రిప్పునకు అనుమతి పేరుతో ఐదారు ట్రిప్పులు తరలిస్తున్నారు. రాజోలి సమీపంలోని తుంగభద్ర నది నుంచీ ఇసుక అక్రమంగా తరలిపోతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు.

ఆన్‌లైన్‌ వెనుక అక్రమాలు

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 12 ఇసుకరీచ్‌లున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌లతో రోజు సగటున 600-800 లారీల్లో ఇసుక తరలివెళ్తోంది. అనుమతికి మించి ఒక్కో లారీలో 3-4 టన్నుల వరకు ఇసుకను అధికంగా నింపుతున్నారు. ఓవర్‌లోడ్‌తో రోడ్లు బాగా దెబ్బతింటున్నాయి. చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌ మండలాల్లో చలివాగు, మోరంచవాగుల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో మండల స్థాయి అధికారి ఇటీవల బదిలీ అయ్యారు. మరుసటిరోజే ఆ ఉత్తర్వులు ఆగిపోయాయి. ఓ ప్రజాప్రతినిధి అనుచరుల ఇసుకదందాకు పరోక్ష సహకారం అందిస్తూ నమ్మకస్తుడిగా వ్యవహరించడంతో ఆయన బదిలీని ఓ నేత తన పలుకుబడితో నిలిపివేయించినట్లు సమాచారం.
* భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం ముర్రేడువాగు నుంచి మూడేళ్లుగా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. భారీ అవకతవకలు జరగడంతో ఆ విషయం బయటకు రాకుండా గతంలో ఓ గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డుల్ని తగలబెట్టారు. ర్యాంప్‌ను కలెక్టర్‌ రద్దుచేశారు. దీంతో ఇసుకదందా మరింతగా పెరిగింది. రెవెన్యూ సిబ్బందిపై దాడికి యత్నించిన ఘటనలూ ఉన్నాయి. నిత్యం 70-90 ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా వెళ్తోంది. ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి దూరప్రాంతాలకు రాత్రివేళ తరలిస్తున్నారు.

కలపదందా నుంచి ఇసుకదందాకు

జగిత్యాల జిల్లాలో గోదావరి తీరప్రాంతం, పెద్దవాగు నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అనధికారికంగా ఏర్పడ్డ గ్రామాభివృద్ధి కమిటీలు టెండర్లు నిర్వహిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మల్లాపూర్‌ మండలంలోని వాల్గొండ, పాతదాంరాజుపల్లి, కొత్తదాంరాజుపల్లి గ్రామాల శివారులో గోదావరి నది నుంచి ఆరేళ్లుగా అక్రమదందా సాగుతోంది. కలప అక్రమరవాణా చేసిన పలువురిపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టు పెట్టి కఠినంగా అమలు చేస్తుండటంతో పలువురు ట్రాక్టర్లను కొనుగోలు చేసి ఇసుకదందాలోకి వచ్చారు.
* కొందరు ఇసుక వ్యాపారులు తమ అక్రమదందా ఆటంకం లేకుండా సాగేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీల్ని రప్పించుకున్నారు. గోదావరి, పెదవాగు సమీప ప్రాంతాల్లో చిన్నచిన్న పాకలు, ఇళ్లలో వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఇక వీరి పని ఇసుకను తోడేసి వాహనాల్లో నింపడమే. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఇలా 80-90 మంది కూలీల్ని రప్పించుకున్నారు.
* పెద్దవాగు పక్కనుండే సాతారం, వెంపల్లి, వెంకట్రావుపేట గ్రామాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సాతారం, పైడిమడుగు వాగుకు ఇరువైపులా ఉంటాయి. ఇసుక తరలింపులో రెండు గ్రామాలవారి మధ్య పలుమార్లు దాడులు చోటుచేసుకుంటున్నాయి. కొత్తపేటలో ఓ కాలనీవాసులు సైతం పలుమార్లు పక్కగ్రామాల వారిపై దాడులకు పాల్పడ్డారు.
* వెంపల్లి, కొత్తదాంరాజుపల్లి గ్రామాల పక్కన పెద్దవాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లలో ఒడ్డుకు తీసుకువచ్చి..అక్కడి నుంచి రాత్రివేళల్లో భారీ యంత్రాలతో లారీలు, టిప్పర్లలో పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ దందాలో ఓ పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. ఒకట్రెండుశాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతూ యథేచ్చగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

నది దగ్గరకు రహదారి వేసేశారు

సూర్యాపేట జిల్లాలో మూసీ నుంచి పెద్దమొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వర్షాలతో నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ వదలకుండా ఇసుకను తోడేస్తున్నారు. నదికి ఆనుకుని, దగ్గరలో ఉన్న గ్రామాల్లో ట్రాక్టర్లు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇసుక అమ్మకాల కోసమే వాటిని కొనుగోలు చేస్తున్నారు.
* నాగారం మండలం పేరబోయినగూడెం పక్క నుంచి మూసీ ప్రవహిస్తోంది. గతంలో పొలాల మధ్యలోంచి మూసీ వరకు సన్నటి బాట ఉండేది. ఇసుక వ్యాపారులు అమాయకరైతుల్ని బలవంతంగా ఒప్పించి పొలాల్లోంచి ట్రాక్టర్లు, లారీల రాకపోకలకు రోడ్డువేశారు. మండలంలో 700కి పైగా ట్రాక్టర్లున్నాయి. 3 గ్రామాల్లో ఐదేళ్లక్రితం 20వరకే ఉంటే.. ఇప్పుడు 170 వరకుఉన్నాయి. స్థానిక రాజకీయ నేతలకూ ట్రాక్టర్లున్నాయి.
*మండల కేంద్రం అర్వపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో రెండొందలకుపైగా ట్రాక్టర్లు ఇసుకను నమ్ముకునే కొన్నారు. ఓ శాఖ అధికారులు ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.10వేలు వసూలు చేస్తున్నారు. రాత్రివేళ తరలిస్తే ట్రిప్పునకు మరో రూ.500 అదనం.

నిబంధనలు సరళతరం చేయాలి

ఇళ్ల నిర్మాణం, ఇతర వ్యక్తిగత అవసరాలకు దగ్గరలోని వాగుల నుంచి ఇసుక తీసుకెళ్లొచ్చు. ఇందుకు మండల అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ ప్రక్రియపై అవగాహనలేక, క్లిష్టంగా ఉండటం వల్ల చాలామంది స్థానిక ఇసుక సరఫరాదారులపై ఆధారపడుతున్నారు. కొందరు ఉపాధి కోసం అక్రమంగా ఇసుకను తోడేస్తుంటే.. మరికొందరు వ్యాపారం చేసి భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు సరళతరం చేయాలని..ఇసుకను అక్రమ రవాణా చేసేవారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అక్రమాలతో ఆరోగ్యానికీ దెబ్బ

ఇసుక ట్రాక్టర్లతో రోడ్లు దెబ్బతిని రాకపోకలకు బాగా ఇబ్బంది పడుతున్నాం. ట్రాక్టర్లతో ధ్వని, ఇసుకతో వాయుకాలుష్యం పెరుగుతోంది. దీంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇసుక అక్రమరవాణాను అరికట్టాలి.

- ఉయ్యాల సుదర్శన్‌, వర్దమానుకోట, సూర్యాపేట జిల్లా

ఇదీ చూడండి:

Attack : పోలీసులపై ఇసుక మాఫియా దాడి

Last Updated : Aug 3, 2021, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details