తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 2:16 AM IST

ETV Bharat / city

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో అదే వైఫల్యం

మట్టిలో కలిసిపోదు. నీటిలోనూ ఇంకిపోదు. అలాగే ఉంచితే ఆరోగ్యానికి ముప్పు. కాల్చితే ఇంకా ప్రమాదం. ప్లాస్టిక్‌ గురించే ఇదంతా. దశాబ్దాలుగా ప్లాస్టిక్ వినియోగం తీవ్రస్థాయికి చేరుకోవటం ఎన్ని సమస్యలు సృష్టిస్తోందో..కళ్లకు కడుతూనే ఉంది. నిషేధిస్తున్నామంటూ ప్రభుత్వాలు ప్రకటించటం.. ఇదంతా మామూలే అని ప్రజలు వినియోగించటం..! ఇదీ వరస. ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రజారోగ్యం బలి అవుతోంది. అటు మూగజీవాల ప్రాణాలకూ ముప్పు పొంచి ఉంటోంది. ఇంత జరుగుతున్న ప్రపంచదేశాలు ఆశించిన స్థాయిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించగలిగాయా..? ఈ ప్రశ్నకు సమాధానంగానే...ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్​ఈపీ) ఓ నివేదిక వెలువరించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో ప్రపంచం ఇంకా వెనకబడే ఉందని ఈ నివేదికలో తేల్చి చెప్పింది.

plastics
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో అదే వైఫల్యం

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో అదే వైఫల్యం

ప్లాస్టిక్ వినియోగం తగ్గించటంలో ప్రపంచ దేశాలు చేసిందేమీ లేదు..! సాధించింది గోరంత..! సాధించాల్సింది కొండంత..! ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్​ఈపీ) ఇటీవల విడుదల చేసిన నివేదికలోని సారాంశమిది. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది..ఈ సంస్థ. ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై అవగాహన కల్పిస్తూ... సూచనలు చేస్తూ వస్తున్న యూఎన్​ఈపీ...2018 నుంచి ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఆ ఏడాది ఎలెన్ మాక్ ఆర్థర్‌ ఫౌండేషన్‌తో చేతులు కలిపి పర్యావరణ నిపుణుల నేతృత్వంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల పని తీరుని మదింపు చేసిన ఈ సంస్థ...ప్రస్తుత నివేదికను మన ముందుంచింది.

ఇంకా వెనుకబడే ఉన్నాయి..

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో ప్రపంచ దేశాలు ఏడేళ్లుగా ఎలాంటి కృషి చేశాయో పరిశీలించింది. ఈ సమయంలో కొంత మేర పురోగతి సాధించినా ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించటంలో ఇంకా పలు దేశాలు వెనకబడే ఉన్నాయని స్పష్టం చేసింది. యూఎన్‌ఈపీ, ఎలెన్ మాక్ ఆర్థర్ ఫౌండేషన్ సంయుక్తంగా...ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు కీలక వ్యక్తులను ఈ విషయమై ప్రచారం చేయాల్సిందిగా కోరాయి. ప్లాస్టిక్‌ని ఓ సారి వినియోగించాక... ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా పునర్వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది...యూఎన్​ఈపీ. ఇలా చేయటం ద్వారా కొత్త ఉత్పత్తులు తయారు చేసేందుకు వీలు కలగటంతో పాటు కొత్త వ్యాపారాలకు ఆస్కారముంటుందని తెలిపింది. ఈ ప్రచారం కొంతమేర ఫలించిన కారణంగా...2019లో సత్ఫలితాలే కనిపించాయి. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు కృషి చేశాయి పలు దేశాలు.

భారత్‌లోనే ముందడుగు

2019లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకొచ్చిన సంస్థల సంఖ్య 500 దాటింది. వీటిలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి చేసే సంస్థలూ ఉండటం గమనించాల్సిన విషయం. ఈ కృషి ఫలితంగానే...పునర్వినియోగ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ప్యాకింగ్‌ 22% మేర పెరగ్గా...వీటి వ్యాపారం ఏకంగా 81% పైగా అధికమైందని తేల్చి చెప్పింది..యూఎన్​ఈపీ నివేదిక. అంటే..సరైన విధంగా కార్యాచరణ అమలు చేయాలే కాని...ప్లాస్టిక్ వాడకం తగ్గించటం పెద్ద కష్టమేమీ కాదని రుజువు చేస్తున్నాయి ఈ గణాంకాలు. కొన్ని సంస్థలైతే..100% ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించటంలో భాగంగా ఓసారి వాడి పడేసే కవర్లు, స్ట్రాలను నిషేధించేందుకు ముందుకొస్తున్నాయి. ఎక్కడో కాదు..! భారత్‌లోనే ఈ ముందడుగు పడింది. ఒకసారి మాత్రమే వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ను తమ ప్యాకేజింగ్‌ నుంచి తొలగించినట్లు అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. దేశంలోని 50 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల్లో ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది.

పునర్వినియోగ విధానాలవైపు

ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్న సంస్థల్లో 56% కంపెనీలు... పునర్వినియోగ విధానాలవైపు మళ్లుతున్నాయి. ప్రస్తుతమున్న సవాలు అధిగమించాలంటే... దాదాపు అన్ని సంస్థలూ ఈ దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందని చెబుతోంది..యూఎన్​ఈపీ. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు...సముద్రాల్లో, వీధుల్లో, అడవుల్లో పేరుకుపోతోందని లెక్కలతో సమస్య తీవ్రతను కళ్లకు కడుతోంది ఈ సంస్థ. ప్రజారోగ్యానికి ఇవి ఏ మేర నష్టం చేస్తాయో ఊహించవచ్చు. ప్లాస్టిక్ కాలుష్యం, వ్యర్థాల కారణంగా...ప్రజారోగ్యం దెబ్బతిని లక్షలాది అకాల మరణాలు సంభవిస్తున్నాయి. అదే సమయంలో భూగోళానికీ చేటు చేస్తున్నాయి..ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు.

స్థానిక అధికార యంత్రాంగాల సమన్వయంతోనే..

గత 50 ఏళ్లలో ప్లాస్టిక్ ఉత్పత్తి 22 రెట్లు పెరిగింది. ఈ ఉత్పత్తికి అవసరమైన వసతుల కల్పనకు దశాబ్ద కాలంలో 180 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది ప్రపంచం. ఇదే సమస్య అనుకుంటే... కరోనా వైరస్ ప్రభావంతో గ్లౌజులు, పీపీఈ కిట్ల వినియోగం పెరిగింది. ఈ సమయంలో...ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ పునర్వినియోగంపై ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం వహించాయి. ఇప్పుడు ఈ సవాలు అధిగమించటమెలా అన్నది అంతు తేలని ప్రశ్న. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనుకుంటున్న ప్రభుత్వాలకు యూఎన్ఈపీ​...మద్దతునిస్తోంది. ఈ లక్ష్యానికి కట్టుబడి ఉన్న వారికి అండగా ఉంటోంది. స్థానిక అధికార యంత్రాంగాల సమన్వయంతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించవచ్చని స్పష్టంగా చెబుతోంది.

ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తున్న దేశాలు

ఈ సందర్భంలోనే ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తున్న దేశాలనూ ప్రస్తావించాలి. ఈ వరుసలో ముందంజలో ఉంది.. ఫ్రాన్స్‌. జర్మనీ, ఇంగ్లాండ్‌ తదితర దేశాలు ఉత్పత్తి, వినియోగాల మీద ఆంక్షల్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ లాంటివి ప్రణాళికా బద్ధంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను నియంత్రిస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రస్తావించకుండానే వ్యర్థాల నుంచి కొత్త ఉత్పత్తులు సృష్టించే పున: శుద్ధి వ్యవస్థతో స్వీడన్‌ రాణిస్తోంది. కోపెన్‌హగెన్‌లోనూ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తగ్గించేందుకు కృషి జరుగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్‌ కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ఇక్కడ ప్లాస్టిక్‌ స్ట్రాలు, స్టిర్రర్స్‌, ప్లాస్టిక్‌తో చేసిన చెవి పుల్లలు వంటివి అమ్మినా, కొన్నా నేరంగా పరిగణించనున్నారు.

భారత్‌లో చట్టాలు అమలవుతున్నాయా..?

కోస్టారికాలో అక్కడి ప్రభుత్వం ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చింది. ఐరోపా దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. భారత్‌లో చట్టాలు, నిబంధనలు, నిషేధ ఉత్తర్వులు లెక్కకు మిక్కిలి అవి అమలవుతున్నాయా అన్నదే కీలక అంశం. వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులేవీ 2022 సంవత్సరంనాటికి కనిపించకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా చిన్నకప్పులు, ప్లేట్లు తదితరాల ఉత్పత్తిని నిలిపే యాలంటూ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి.

కాగితాలకే పరిమితం

రాష్ట్రాలవారీగా ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి, తయారీ, వినియోగం, పంపిణీ, నిల్వ, విక్రయం, దిగుమతిపై నిషేధ ఉత్తర్వులున్నా..అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. దేశంలో ఏటా ఉత్పత్తవుతున్న ఆరు కోట్ల 20 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ చెత్తలో శుద్ధీకరణకు నోచుకుంటున్నది... 22-28 శాతమే. వ్యర్థాల్లో ఎక్కువ భాగాన్ని ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పోస్తున్నారు. వాటినే ఆహారంగా తీసుకుంటున్న మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశవ్యాప్తంగా రోజూ కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడుతుండగా, అందులో 40 శాతాన్నే సేకరిస్తున్నారు. వీధుల్లో వ్యర్థాలు పేరుకుపోతున్న నగరాల జాబితాలో దిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, సూరత్‌ ముందున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు

భారత్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సరిగా లేదన్న మాట ఎంత నిజమో.. కొన్ని ప్రభుత్వాలు ఈ సమస్యకు కొంత మేర పరిష్కారం వెతుక్కుంటున్నాయన్నది అంతే నిజం. త్రిపురలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్డు నిర్మించటం ఇటీవల జరిగిన కీలక పరిణామం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేయడం ద్వారా 680 మీటర్ల రోడ్డును నిర్మించారు. త్రిపుర రాజధాని అగర్తలాలోని బీకే రోడ్డులో ఉన్న మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ రోడ్డు రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్‌ రోడ్డు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించిన ఈ రోడ్డు నిర్మాణానికి 70 లక్షల రూపాయల ఖర్చైంది. బెంగళూరు వెళితే ప్లాస్టిక్‌తో వేసిన రోడ్లు మనకు దర్శనమిస్తాయి. 2002 నుంచి కేకే ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఈ నగరంలో సుమారు 2వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను వేసింది. ఇందుకోసం 10వేల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించింది.

పునర్వినియోగ విధానాలవైపు మళ్లాలి..

ప్లాస్టిక్‌ వినియోగం సమస్యే..! కాదనట్లేదు. కానీ...వ్యర్థాల నిర్వహణలో లోపం అంతకు మించిన సమస్య అన్నది కచ్చితంగా గుర్తించాల్సిన విషయం. ఇప్పటికే ప్రపంచదేశాలు వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాయి. 2025 నాటికి ప్లాస్టిక్ వినియోగాన్నిపూర్తిగా తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లక్ష్యం చేరుకోవాలంటే...ప్రస్తుతం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు చాలవు. పునర్వినియోగ విధానాలవైపు ఎంత వేగంగా మళ్లితే...అంత తొందరగా ప్లాస్టిక్ సవాలు అధిగమించవచ్చని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు.

ఇదీ చదవండి: కరోనా సెకండ్ వేవ్​- కారణాలు ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details