ఏపీలో సుమారు 4.70 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.20 లక్షల మంది ఉపాధ్యాయులు, మరో 4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి గతంలో జీతాలుSalaries, పింఛన్ల చెల్లింపులో జాప్యం జరిగిన దాఖలాలు చాలా తక్కువ. అందరి ఖాతాల్లో ఒకటో తారీఖునే పడేవి. ఆ రోజు ఆదివారమో, మరైదేనా సెలవు దినమో వస్తే ఆ మర్నాడు వేసేసేవారు. ఇప్పుడు ఏకంగా పదో తారీఖు వచ్చినా అందరికీ వేతనాలు, పింఛన్లు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఒక అధికారి ఖాతాలో శుక్రవారం సాయంత్రానికి కూడా పెన్షన్ డబ్బు జమ కాలేదు. అదే విషయాన్ని హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో నివసించే ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి చెందిన విశ్రాంత అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో ఉంచారు. అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తనకు పెన్షన్ మొత్తం జమ అయిందని ఆయన వెల్లడించారు.
సమాధానం చెప్పే అధికారులేరీ?
ఇప్పటికీ 20 శాతం మంది ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు రాలేదు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. కేంద్రం నుంచి డబ్బులు వచ్చాయా? లేదా? అప్పు దొరికిందా? లేదా? అన్నది ప్రభుత్వం చూసుకోవాల్సిన వ్యవహారం. దానికీ ఉద్యోగుల జీతాలకూ ముడిపెడితే ఎలా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఖజానా శాఖ డైరెక్టర్‌ని, సీఎఫ్‌ఎంఎస్ సీఈఓని కలసి విన్నవించాం. మొత్తం సీఎఫ్‌ఎంఎస్ వ్యవహారాలు చూస్తున్న ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణను కలుద్దామంటే... సచివాలయంలో ఆయన ఎప్పుడూ దొరకరు.
- బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు
ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు
ఇప్పటికీ జీతాలు, పెన్షన్లు రానివారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్క్‌ఛార్జ్‌డ్ ఎంప్లాయిస్‌కి ఇంకా జీతాలివ్వలేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వడం లేదు. వాటి పరిస్థితేంటి, ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికి వస్తాయని చెప్పేవాళ్లు లేరు.