తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD EO : 'వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుపుదాం' - Salakatla Brahmotsavalu

TTD EO Dharma Reddy : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తామని.. తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో కలిసి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లగా కరోనా ప్రభావంతో ఘనంగా నిర్వహించలేకపోయామని అన్నారు.

TTD EO Dharma Reddy
TTD EO Dharma Reddy

By

Published : Jul 2, 2022, 10:55 AM IST

TTD EO Dharma Reddy : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వరకు జరగనున్నాయని, మాడవీధుల్లో శ్రీవారి వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం రోజున అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుపుదాం

సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరగనుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. అక్టోబరు 1న గరుడవాహన సేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం జరుగుతాయన్నారు. కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.

ఈసారి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుందని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు, బ్రేక్‌ దర్శనాలు రద్దుచేస్తామన్నారు. ప్రొటోకాల్‌ వీఐపీలకే బ్రేక్‌ దర్శనాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. గరుడసేవ రోజున, ముందు, తరువాత రోజు ఆన్‌లైన్‌లో గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన రోజులకు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో కేటాయిస్తామని, మిగిలినవి కరెంట్‌బుకింగ్‌ కింద భక్తులకు ఇస్తామని చెప్పారు. ఈ పర్యాయం విద్యుత్‌ కటౌట్లను ఏర్పాటు చేయబోమని అన్నారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details