Sajjala Fires On BJP: తెదేపా అధినేత చంద్రబాబు అజెండానే భాజపా నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఆయనవేననీ.. స్ట్రిప్ట్ మాత్రం తెదేపా కార్యాలయంలో తయారవుతోందని ఆరోపించారు. తెదేపా, భాజపాలకు సొంత అజెండా లేదన్నారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు.
రాజధాని అమరావతి స్కాములమయం అని గతంలో భాజపా నేతలు చెప్పారని సజ్జల గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారని ఆక్షేపించారు. కర్నూలులో హైకోర్టు ఉండాలంటారు.. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఆయా పార్టీలతో చంద్రబాబు విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు అని సజ్జల ఎద్దేవా చేశారు.
"మాటలు సోము వీర్రాజువి.. స్క్రిప్ట్ ఎన్‌టీఆర్ భవన్‌ది. తెదేపా నుంచి వెళ్లిన ఎంపీలే భాజపాను నడిపిస్తున్నారు. విశాఖలో రాజధాని వద్దని భాజపా నేతలు చెప్పాలి. తెదేపా, భాజపా, కాంగ్రెస్, సీపీఐ, జనసేన ఒకటే. భాజపా రాకముందు దేశానికి రూ.75 లక్షల కోట్లే అప్పు ఉంది. అధికారంలోకి వచ్చాక ఆ అప్పు రూ.135 లక్షల కోట్లుకు చేరింది. మోదీ పేరు పెట్టే రాష్ట్రంలో జగన్ ఇళ్లు కడుతున్నారు. రూ.50కే మద్యం అన్న సోము వీర్రాజు మాట చంద్రబాబు స్క్రిప్ట్‌లోదే. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇదే మద్యం పాలసీ అమలుచేస్తారా..?" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు