తెలంగాణ

telangana

ETV Bharat / city

Gorati Venkanna: ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - Sahitya Akademi Awards 2021

gorati venkanna got Sahitya Akademi Award
gorati venkanna

By

Published : Dec 30, 2021, 3:23 PM IST

Updated : Dec 30, 2021, 11:05 PM IST

15:21 December 30

ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Gorati Venkanna: ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Gorati Venkanna: కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అపూర్వగౌరవం దక్కింది. 2021 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. 'వల్లంకి తాళం' కవితా సంపుటికి ఈ పురస్కారం వచ్చింది. మానవీయ సంస్కృతి, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపుగా 'వల్లంకి తాళం' కవిత సంపుటిని గోరటి తీర్చిదిద్దారు. కేంద్ర సాహిత్య పురస్కారం రావడంపై గోరటి వెంకన్న ఆనందం వ్యక్తంచేశారు.

గోరటి వెంకన్న తన కవిత్వంలో ప్రజల జీవితాలను కళ్లకు కట్టారు. జనం కష్ట సుఖాలను, వెతలను, హింసకు గురవుతున్న విధానాలను ఎలుగెత్తిచాటారు. 'వల్లంకి తాళం' కవితసంపుటిలోనూ గోరటి తన మార్కు చూపించారు. 'పల్లె కన్నీరు పెడుతుందో..' అంటూ ప్రపంచీకరణ వల్ల జరిగిన నష్టాన్ని హృదయాలను తాకేలా వివరించారు. 'గల్లీ సిన్నది పాటలో..' బస్తీ బతుకులను గోరటి వెంకన్న ఆవిష్కరించారు. 'పల్లెపల్లెన పల్లేర్లు మొలిసే పాటలో..' దుర్భర స్థితిలో ఉన్న తెలంగాణ పల్లె కష్టాలను వివరించారు. గోరటి పాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారంలో 1963లో జన్మించిన గోరటి వెంకన్న.. వల్లంకి తాళంతో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు.

తగుళ్ల గోపాల్‌, దేవరాజు మహారాజుకు...

Sahitya Akademi Awards 2021: తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. దండకడియం కవితాసంపుటికి పురస్కారం దక్కింది. 'నేను అంటే ఎవరు' నాటకానికి దేవరాజు మహారాజుకు బాలసాహిత్య పురస్కారం వరించింది.

వెంకన్న సాహితీ సృష్టి చేశారు..: కేసీఆర్​

KCR On Gorati Venkanna: గోరటికి సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోరటి వెంకన్నకు అభినందనలు తెలిపారు. ‘వల్లంకి తాళం' కవితాసంపుటికి అవార్డు దక్కడం హర్షణీయమన్నారు.. కేసీఆర్‌. ఇందులో మనిషి, ప్రకృతి బంధాన్ని వెంకన్న ఆవిష్కరించారని ప్రశంసించారు. విశ్వ మానవుని వేదనకు వెంకన్న కవిత అద్దం పట్టిందని.. సామాజిక తాత్వికతతో వెంకన్న సాహితీ సృష్టి చేశారని కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను గోరటి విశ్వవ్యాప్తం చేశారన్న కేసీఆర్‌.. ఈ అవార్డు తెలంగాణ మట్టిమనిషి జీవన తాత్వికతకు దక్కిన గౌరవమని చెప్పారు.

తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి చాటారు: కేసీఆర్​

బాల సాహిత్య పురస్కారం దక్కిన ప్రముఖ రచయిత దేవరాజు మహారాజు, సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించిన తగుళ్ల గోపాల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాహిత్యానికి సంబంధించిన మూడు విభాగాల్లో తెలంగాణ బిడ్డలకు అవార్డులు లభించడం.. తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి చాటిందని సీఎం అన్నారు.

తెలంగాణ భాష, యాసకు మరోసారి గుర్తింపు

ప్రముఖ కవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు మంత్రి శ్రీనివాస్​గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్​ జిల్లాకు చెందిన సురవరం ప్రతాప్​రెడ్డి తర్వాత గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ భాష, యాసకు మరోసారి గుర్తింపు లభించిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన సాహిత్యంతో గోరటి వెంకన్న కీలక పాత్ర పోషించారన్నారు.

సాహిత్య అకాడమీ అవార్డులు సంతోషదాయకం..

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం సంతోషదాయకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జానపదుల హృదయాలను తన కలం, గళంతో అద్భుతంగా ఆవిష్కరించారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు. తెలంగాణ బిడ్డలు తూగుళ్ల గోపాల్‌కు యువ పురస్కారం, దేవరాజు మహారాజుకు బాల సాహిత్య అవార్డు రావడం గర్వకారణమని, వారందరికీ అభినందనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతితో మమేకమై జీవించే కవి.. గోరటి వెంకన్న..

ప్రకృతితో మమేకమై జీవించే కవి, రచయిత గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. తాను ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే రాష్ట్రానికి మూడు సాహిత్య అవార్డులు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు తెలంగాణ సాహిత్యానికి జరిగిన పట్టాభిషేకంగా గౌరీశంకర్ అభివర్ణించారు. ప్రపంచ తెలుగు మహాసభలతోపాటు తెలంగాణ ఉద్యమంలో గోరటి వెంకన్న పాత్ర కీలకమని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం యావత్ సాహిత్య అభిమానులందరికీ గర్వకారణమన్నారు.

ఇదీచూడండి:

Last Updated : Dec 30, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details