దీపావళి పండుగ సందర్భంగా... బాణాసంచా విక్రేతలు నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొని దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. మాస్కులు లేకుండా వచ్చే కొనుగోలుదారులను దుకాణంలోనికి అనుతించకూడదని హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు.
బాణాసంచా దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలి: అగ్నిమాపక శాఖ - safety measures in Hyderabad cracker shops
దీపావళి పండుగ వస్తుందంటే.. చిన్నాపెద్ద అందరిలోనూ ఆనందం. బాణాసంచా కాలుస్తూ.. వేడుకలు జరుపుకోవడానికి జంటనగరాల ప్రజలు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో బాణాసంచా దుకాణదారులు ప్రమాదాలు జరగకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నిబంధనలకనుగుణంగా అన్ని అనుమతులు తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాణాసంచా దుకాణాలు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి దుకాణదారుడు విధిగా అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటిని సమీపంలో నిల్వ చేసి ఉంచుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారమివ్వకుండా ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దుకాణదారులు ఏ విధంగా వ్యవహరించాలో, సిబ్బంది వచ్చే లోపు మంటలను అదుపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై.. వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో దీపావళి రోజున 22 అగ్నిమాపక వాహనాలను సిద్దంగా ఉంచనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.