దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా హైదరాబాద్ Safe metro city Hyderabad: దేశంలో అత్యంత సురక్షిత మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర నేర రికార్డుల విశ్లేషణా సంస్థ ఎన్సీఆర్బీ నివేదికలో ప్రకటించింది. దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో కోల్‌కతా ప్రథమ స్థానంలో ఉండగా, పుణె రెండవ స్థానంలోనూ, హైదరాబాద్ మూడోస్థానంలో ఉందని పేర్కొంది.
ఎన్సీఆర్బీ విశ్లేషణ..దేశంలో రెండు మిలియన్ జనాభా ఉన్న నగరాల్లో విచారణకు అర్హమైన నేరాల నమోదును ఎన్సీఆర్బీ విశ్లేషించింది. దీని ప్రకారం ప్రతి మిలియన్ జనాభాకు హైదరాబాద్‌లో కేవలం 2599 నేరాలు మాత్రమే జరుగుతున్నాయి. దిల్లీలో ఐతే 18596తో దేశంలోనే క్రైమ్‌పరంగా అగ్రస్థానంలో ఉంది. అత్యంత తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా 1034 కేసుల నమోదుతో కోల్‌కతా అగ్రస్థానంలో ఉండగా 2568 నేరాలతో పుణె ద్వితీయ స్థానంలో ఉంది. అత్యధిక నేరాలతో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు తర్వాతి వరుసలో నిలిచాయి.
దక్షిణాది రాష్ట్రాలల్లో అతి తక్కువ నేరాలల్లో హైదరాబాద్..దక్షిణాది మెట్రో నగరాల్లో అతితక్కువ నేరాలు జరిగే నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఐటీ నగరంగా పిలుచుకునే బెంగళూర్‌లో ప్రతి మిలియన్ జనాభాకు 4 వేల 272 నేరాలు నమోదవుతూ సురక్షిత నగరాల్లో ఐదవ స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతాలో 45 , హైదరాబాద్‌లో 98 , బెంగళూర్‌లో 152 , దిల్లీలో 454 , ముంబయిలో 162 హత్య కేసులు నమోదయ్యాయి. అత్యాచారం కేసులను పరిశీలిస్తే కోల్‌కతాలో 11 , హైదరాబాద్‌లో 116 , బెంగళూరులో 117 , దిల్లీలో 1226 , ముంబయిలో 364గా ఉన్నాయి. మహిళలపై దాడుల్లో కోల్‌కతాలో 127, హైదరాబాద్‌లో 177, బెంగుళూర్‌లో357, దిల్లీలో 1023 జరిగాయని ప్రభుత్వం తమ నివేదికలో పేర్కొంది.
కేంద్ర నేర రికార్డుల విశ్లేషణా సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేయగా రాష్ట్ర పోలీసుల ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.