తెలంగాణ

telangana

ETV Bharat / city

SAFA Foundation: ఒంటరి మహిళలకు భరోసా.. మేమున్నామని ముందుకు నడిపించే ధైర్యం 'సఫా'

ఒంటరి మహిళలు...! చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కుటుంబాన్ని పోషించలేక...పిల్లల్ని చదివంచలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి మేమున్నామంటూ చేయూతనిస్తుంది 'సఫా స్వచ్ఛంద సంస్థ'. వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది.

Safa foundation working for alone women
Safa foundation working for alone women

By

Published : Oct 22, 2021, 4:46 AM IST

ఒంటరి మహిళల అభ్యున్నతి కోసం 2006లో ప్రారంభమైంది సఫా ఫౌండేషన్‌. మహిళలకు టైలరింగ్‌లో నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలతో హైదరాబాద్​ బహదూర్‌పురాలోని వట్టేపల్లిలో ప్రారంభమైంది. నెల రోజులపాటు వారికి శిక్షణ అందించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎలా మారాలో.. ఈ ఫౌండేషన్​ శిక్షణ అందిస్తుంది. ఉత్పత్తి, మార్కెటింగ్, లాభనష్టాల బేరీజు తదితర అంశాలపై శిక్షణ ఇస్తుంది. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ఇప్పటికే 70 శాతం మందికి మంచి ఉపాధి అవకాశాలు లభించాయంటే.. ఈ ఫౌండేషన్​ ఎంత నిబద్ధతతో పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

లుక్మా కిచెన్​తో మొదలు..

ఒంటరి మహిళలు పడుతున్న కష్టాలపై అధ్యయనం చేసిన సంస్థ.. వాళ్లు పడుతున్న అవస్థల నుంచి బయటపడేసి.. మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. 2019లో బహదూర్‌పురాలోని వట్టేపల్లిలో లుక్మా కిచెన్‌ను ప్రారంభించింది. ఇళ్లలో పాచి పనిచేసే మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి.. వారిని హైదరాబాదీ రుచులను వండడంలో నిష్ణాతులుగా తయారు చేసింది. ఇందుకోసం ప్రముఖ చెఫ్‌లతో శిక్షణ అందించింది. అనంతరం నవాబ్‌ సాహెబ్‌కుంటలో మరొక లుక్మాకిచెన్‌ను ప్రారంభించింది. ఇక్కడ సుమారు 15 మంది మహిళలు పని చేస్తున్నారు.

మహిళలతోనే డోర్​ డెలివరీలు..

‘ప్రతి ఒక్కరు యజమాని, ప్రతి ఒక్కరు ఉద్యోగి’ అనే కాన్సెప్ట్‌పై ఈ సంస్థ పనిచేస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ఆర్డర్లు తీసుకోవడం.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వాటిని ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయడం ఇక్కడి ప్రత్యేకత. మహిళలనే పూర్తి స్థాయి రైడర్లుగా నియమించి వారితోనే డోర్‌ డెలివరీలు చేయించి.. అందులోనూ వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడ ఫుడ్‌ ఆర్డర్లు ఇస్తుంటారు. వినియోగదారుడు కోరిన విధంగా మాత్రమే అప్పటికప్పుడు ఆహారం తయారు చేసి అందిస్తుండటం వల్లే లుక్మా కిచెన్‌కు ఆదరణ తగ్గడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

విభిన్న హైదరాబాదీ రుచులు..

"నగరంలో మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా రీక్రియేషన్‌ హబ్‌లు వెలుస్తున్నాయి. నగరంలో వెలిసిన మరో రీక్రియేషన్‌ హబ్‌ లుక్మా స్టూడియో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడానికి, స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ సరదాగా గడపడానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాం. కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. ఇక్కడికి వచ్చినవారందరూ లుక్మా కిచెన్‌ వంటకాలన్నీ రుచి చూసే వెళ్తారు. దమ్‌ కా కీమా, తలవా గోష్ట్, బగార్‌-ఇ-బైగన్, అచారి చికెన్, కుబూలీ, కిచిడీ కట్టా, దాల్చా వంటి విభిన్న హైదరాబాదీ రుచులను ఆస్వాదిస్తుంటారు." -యూనస్, సఫా స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్

ఆర్టిజన్​ సెంటర్​ ద్వారా ఉపాధి..

నవాబ్‌ సాహెబ్‌ కుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆర్టిజన్‌ సెంటర్‌ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి చిన్నారుల ఏకరూప దుస్తులు, రెడిమేడ్‌ దుస్తులు, వైవిధ్యమైన జ్యూట్‌ బ్యాగులు తదితరాలు అందిస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర కళాశాలలు సైతం సమావేశాలు ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు అందరికీ పంచడానికి జ్యూట్‌ బ్యాగులను ఇక్కడి నుంచే ఆర్డరు ఇస్తుంటాయని సఫా ఫౌండేషన్‌ సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మేనేజర్‌ సయ్యద్‌ యూనస్‌ తెలిపారు.

ఆపద సమయాల్లో సాయం..

కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ఈ సంస్థ సూక్ష్మ రుణాలు అందజేసింది. ఆర్టిజన్‌ సెంటర్‌ ద్వారా లక్ష మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేసింది. మరెంతో మంది అన్నార్తుల ఆకలి తీర్చింది. హైదరాబాద్‌ నగరాన్ని వరదలు అతలాకుతలం చేసిన సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేసింది. స్కూల్‌ చిన్నారులకు ఉచిత ట్యూషన్లు చెప్పించడం, పై చదువులు చదవలేని స్థితిలో ఉన్న వారికి కెరీర్‌ గైడెన్స్, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అందించి ఉపాధి కల్పిస్తోంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details