'నేలతల్లిని రక్షించుకుందాం' Save Soil : మట్టిని రక్షించాలనే ఉద్యమానికి పిలుపునిచ్చి ద్విచక్రవాహనంపై యాత్ర చేపట్టిన.. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉద్యమంలో భాగంగా ఇప్పటికే 30 వేల కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి....... 27 దేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. సుమారు 560 వేడుకలు నిర్వహించి ప్రజలకు.. నేల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అందులో భాగంగా హైదరాబాద్ చేరుకున్న జగ్గీవాసుదేవ్‌కు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఇషా వాలంటీర్లు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సినీ నటి సమంత సహా పలువురు నటీనటులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేడుకలో పాల్గొన్నారు.
Sadguru visits hyderabad : మనుగడ పేరుతో మనిషి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నా..... మట్టిని కాపాడుకోవడం ప్రధాన కర్తవ్యంగా భావించాలని జగ్గీవాసుదేవ్ సూచించారు. పర్యటనలో 27 దేశాల సానుకూలంగా స్పందించినా.. మట్టి సంరక్షణకు అవసరమైన కార్యచరణ అమలు చేయడం లేదన్నారు. ఇందుకోసం తానే 25 మంది సభ్యులతో కూడిన కమిటీతో..... ప్రత్యేక విది విధానాలు రూపొందించి ఆయా దేశాలకు అందించనున్నట్లు వెల్లడించారు.
సద్గురు చేపట్టిన మట్టిని రక్షించే ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం తోడుగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జీవం మనుగడ సాగించాలంటే నేలను కాపాడుకోవాలని, నేలను నిర్లక్ష్యం చేస్తే ఆహార కొరత తలెత్తి తీవ్ర సంక్షోభం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయ కర్తవ్యం ద్వారా మాత్రమే భూమిని కాపాడుకోగలమన్న నిరంజన్ రెడ్డి... ఎరువులు, పురుగు మందుల మీద నియంత్రణ లేకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇషా ఫౌండేషన్ ఔట్ రీచ్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వ తరపున అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా సద్గురు జగ్గీవాసుదేవ్‌తో సినీనటి సమంత సాగించిన సంభాషణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మట్టిని రక్షించే ఉద్యమంలో..... ద్విచక్రవాహనం వాడటం దగ్గరి నుంచి ఆధ్యాత్మిక విషయాలపై సమంత అడిగిన ప్రశ్నలకు సద్గురు సమాధానాలు చెప్పారు. ఆధ్యాత్మికతపై ఈ సందర్భంగా సద్గురు కీలకవ్యాఖ్యలు చేశారు. ఆర్ధికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఆధ్యాత్మికత మనకు స్ఫురించదన్న ఆయన... తన జీవితంలో 60 నుంచి 65శాతం మంది మంచివాళ్లను ఆధ్యాత్మిక కేంద్రాల బయటే కలిసినట్లు చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా నేలతల్లిని కాపాడుకోవాలంటూ నృత్యకారిణి రాధే జగ్గీ తన బృందం చేసిన కలరీ నృత్యప్రదర్శన.. ఆహుతులను మంత్రముగ్దులను చేసింది. మట్టి విశిష్టతను తెలియజేస్తూ గాయనీగాయకులు మంగ్లీ, రామ్ మిర్యాల ఆలపించిన పాటలతో గచ్చిబౌలి మైదానం మారుమోగింది. సద్గురు సైతం గాయనీ గాయకులతో గొంతు కలపడం వేడుకల్లో పాల్గొన్న వారిని మరింత ఉత్సాహపరిచింది.