రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు(saddula bathukamma 2021) అంబరాన్నంటాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రంగురంగుల పట్టుచీరలు, పట్టుపరికిణీలు.. ఒళ్లంతా నగలతో ఆడబిడ్డలంతా సింగారించుకుని ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. రహదారులన్ని కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో వీధులన్ని మారుమోగిపోయాయి.
సీఎం శుభాకాంక్షలు..
పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ(saddula bathukamma 2021) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు(saddula bathukamma wishes in telugu) తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్పూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
మారుమోగిపోయిన గ్రామాలు..
రాష్ట్రంలోని చాలా చోట్ల సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో వేడుకల్లో హాజరయ్యారు. మహిళలంతా ఉత్సాహంగా.. ఉయ్యాల పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడారు. రకరకాలు పాటలతో.. వివిధ రూపాల నృత్యాలతో.. ఊళ్లన్ని ఉత్సాహంతో ఊగిపోయాయి. కొన్ని చోట్ల డీజేల్లో బతుకమ్మ పాటలు పెట్టి.. కోలాటాలతో యువతులు హోరెత్తించారు. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు.. అందరూ బతుకమ్మ ఆటల్లో కాలు కదిపారు. రకరకాల నృత్య రీతులతో.. ఆనందంగా పండుగను ఆస్వాదించారు.
ప్రగతి భవన్‌లో సద్దుల సందడి