తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండేళ్లుగా ఎదురుచూపుల్లో సాదాబైనామా.. బాధలు తీరేదెన్నడు? - తెల్లకాగితాలపై భూవిక్రయాలు

రెవెన్యూ చట్టం మారడంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్రంలో 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు రెండు విడతలుగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ, వాటికి మోక్షం లభించకపోవటం వల్ల రెండేళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Sadabainama
సాదాబైనామా

By

Published : Jun 26, 2022, 5:49 AM IST

తెల్లకాగితాలపై జరిగిన భూ విక్రయాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. రాష్ట్రంలో 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు రెండు విడతలుగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. మొత్తం 8.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే సందర్భంలో రెవెన్యూ చట్టం మారడంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియపై అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలో పాత ఆర్‌వోఆర్‌ చట్టం ప్రకారం దరఖాస్తులను పరిష్కరించేందుకు రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకున్నా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు. ఒక దశలో ఆర్డినెన్స్‌ తెచ్చి చట్టంలో మార్పులు చేయాలని మంత్రివర్గం చర్చించింది. కానీ, అమలుకు నోచుకోలేదు.

క్షేత్రస్థాయిలో గందరగోళం..2014 జూన్‌2కు ముందు సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూమిని క్రమబద్ధీకరించేందుకు 2016లో అవకాశం ఇచ్చారు. 11.19 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 6.18 లక్షల మంది సాదాబైనామాలను క్రమబద్ధీకరించారు. సరైన సమాచారం లేక, ఆధారాలు లేక నాడు చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ఎమ్మెల్యేలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీలు, ప్రజా సంఘాలు కూడా పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. దీంతో 2020లో సర్కారు మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పటికీ ఆ దరఖాస్తుల పరిస్థితిపై రెవెన్యూశాఖ స్పష్టత ఇవ్వడం లేదని బాధితులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం తిరస్కరణకు గురయ్యాయని రెవెన్యూ సిబ్బంది చెబుతుండటంతో హతాశులవుతున్నారు.

ధరణిలో సమాచారం ఉంటేనే సాధ్యం..సాదాబైనామా ఒప్పందంతో జరిగిన భూ విక్రయంలో యజమాని పేరు రెవెన్యూ దస్త్రాల్లో మారదు. తెల్లకాగితంపై యజమానుల పేర్లు మార్చుతూ రాసుకున్న ఒప్పందం మాత్రమే బాధితుల వద్ద ఉంటుంది. ప్రస్తుతం ధరణి ఆధారంగా యాజమాన్య హక్కుల మార్పిడి కొనసాగుతున్న నేపథ్యంలో పాత రైతుల పేర్లు మాత్రమే పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయాలంటే ధరణిలో పాత రైతు పేరు స్థానంలో ప్రస్తుత రైతు పేరు చేర్చాలి. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలన కీలకం. ఆర్‌వోఆర్‌ చట్టం సెక్షన్‌-11 ప్రకారం కొనుగోలుదారుడికి, సెక్షన్‌-12 ప్రకారం విక్రయదారుడికి తహసీల్దారు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ భూమి సరిహద్దు రైతుల వాంగ్మూలం నమోదు చేయాలి. కొనుగోలు చేసిన రైతు ఎన్నేళ్లుగా సాగులో ఉన్నారో నిర్ధారించాలి. ఇంత ప్రక్రియ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో విచారణ కూడా సాగడం లేదు. లక్షల సంఖ్యలో ఉన్న దరఖాస్తుల పరిష్కార బాధ్యత ఎప్పటికైనా రెవెన్యూశాఖదే.

భారీగా ఆదాయం.. అనర్హులపై వేటు!సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపడితే ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వస్తుంది. తెల్లకాగితాలపై ఒప్పందాలను గుర్తిస్తే ఆ భూముల లావాదేవీల సందర్భంలో ఆదాయం వచ్చే అవకాశముంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో స్టాంపు డ్యూటీ కూడా సర్కారుకు ఎక్కువ మొత్తంలోనే వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 4.04 లక్షల దరఖాస్తులను కలెక్టర్ల లాగిన్‌కు రెవెన్యూశాఖ పంపగా వాటిని ఆన్‌లైన్‌లోనే పరిశీలించి అర్హతలేని 2 లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ సమాచారం దరఖాస్తుదారులకు అధికారికంగా తెలియజేయడం లేదని, కార్యాలయాల్లో సిబ్బందిని కలిసిన సమయంలో మాటమాత్రంగా చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇదీ చూడండి:టీచర్ల ఆస్తులకు సంబంధించిన ఉత్తర్వులపై స్పందించిన ప్రభుత్వం

పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details