రాష్ట్రంలో వానాకాలం పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.నేడు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విత్తనాలు, ఎరువుల ప్రణాళిక, రైతుబంధు, ఇతరు సంస్థాగత రుణాలు వంటి అంశాలు విస్తృతంగా చర్చించి రైతుల ముందుకు ఉంచాలంటూ సూచించింది. ఈ మేరకు అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగారెడ్డి, తీగల సాగర్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
జూన్ నుంచి వానాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా.. యాసంగి ధాన్యాన్ని 8 నాటికి కొనుగోలు పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగిలో 1.35 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. 67 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ ప్రకటించిన తరుణంలో... ఇంకా రైతుల దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్న 30 లక్షల టన్నులు ధాన్యం మొత్తాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. వానా కాలం సంబంధించి విత్తనాలు, ఎరువుల వినియోగం, రుణ అవసరాలు, నిషేధిత క్రిమిసంహారక మందుల జాబితాలు, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఏ పంటలు వేయాలో సూచిస్తూ వార్షిక ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.