ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులు వందశాతం నియంత్రిత విధానంలో పంటలు సాగుచేస్తుండటం శుభసూచకమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాందని పేర్కొన్నారు. రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఉన్నా గుర్తించి అందించాలని ఆదేశించారు. రైతుబంధు అమలు, ఇతర వ్యవసాయ పథకాలపై శనివారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, రామకృష్ణారావు, జనార్దన్‌రెడ్డి, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
దసరా నాటికి రైతు వేదికలు
తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోంది. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ప్రక్రియను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టాయి. వాటి నిల్వకు అత్యాధునిక శీతలగిడ్డంగి అవసరం. దీని నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేస్తాం. ఏడాదిలోగా దీన్ని అందుబాటులోకి తేవాలి. రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలి. ఇవి పూర్తయితే రైతులకు రక్షణ వేదికలవుతాయి. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వానాకాలం పంటలు సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన.
-కేసీఆర్, సీఎం
ఇది గొప్ప పరిణామం
నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామమని సీఎం పేర్కొన్నారు. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందన్నారు. ఇది శుభసూచకని... తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతల స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తోందని తెలిపారు. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తోందని వెల్లడించారు.