తెలంగాణ

telangana

ETV Bharat / city

Rythu bandhu Celebrations: రాష్ట్రంలో ముందే సంక్రాంతి.. నేటి నుంచి రైతుబంధు సంబురాలు

Rythu bandhu Celebrations: రాష్ట్రంలో సంక్రాంతితో పాటు రైతుబంధు సంబురాలు కూడా జరగనున్నాయి. జనవరి 3 నుంచి 10 వరకు రైతుబంధు సంబురాలు నిర్వహించనున్నట్టు మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంఎస్ ఛైర్మన్లకు.. సంబురాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

Rythu bandhu Celebrations starting from tomorrow in telangana
Rythu bandhu Celebrations starting from tomorrow in telangana

By

Published : Jan 2, 2022, 9:47 PM IST

Updated : Jan 3, 2022, 5:42 AM IST

Rythu bandhu Celebrations: రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు రైతుబంధు సంబురాలు నిర్వహించనున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. జనవరి 3 నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబురాలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలను తెరాస ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో.. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డిలతో కలిసి కేటీఆర్​ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్పరెన్స్​లో పాల్గొన్న తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంఎస్ ఛైర్మన్లకు.. రైతుబంధు సంబరాలపై కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు.

చారిత్రకమైన సందర్భం...

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి.. ఎన్నడూ ఆలోచించని స్థాయిలో రైతుల గురించి కేసీఆర్ ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అని కేటీఆర్​ కొనియాడారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 10 నాటికి 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయన్నారు. రైతుబంధు అమలైనప్పటి నుంచి అన్నదాతల్లో ఎనలేని సంతోషం వెల్లివిరిస్తుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి రైతుబంధు ఒక గొప్ప ఊతంగా మారిందన్నారు. 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరిన సందర్భం దేశ చరిత్రలో ఎన్నడూ లేదని.. ఇలాంటి అద్భుతమైన సందర్బాన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఆ రెండు కార్యక్రమాలతో మరింత అవగాహన..

కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తుంచుకొని రైతుబంధు సంబరాలు నిర్వహించాలన్నారు. శాసనసభ్యులు ఈ సంబురాల విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీశ్రేణులను కలుపుకొని ముందుకు పోవాలన్నారు. రానున్న సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా... మహిళా లోకాన్ని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ రెండు కార్యక్రమాలు చేపడితే మహిళా లోకంతో పాటు భవిష్యత్ తరానికి కూడా రైతుబంధు గురించి మరింత అవగాహన కలుగుతుందన్నారు.

ఘనంగా ముగింపు సంబురాలు..

ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి.. రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఆరు వందలకు పైగా రైతు వేదికల వద్ద పండగ వాతావరణంలో జనవరి 10వ తేదీన ఘనంగా ముగింపు సంబురాలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సంబురాలకు సంబంధించి కావల్సిన ఎలాంటి సమాచారాన్ని అయినా ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందించేందుకు వ్యవసాయశాఖ సిద్ధంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సాగు వైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నారు. అలాంటి ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 3, 2022, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details