India russia summit: భారత్ మాకు నమ్మదగిన మిత్రదేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. బలమైన శక్తి అని, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన తమ మిత్రదేశమని కొనియాడారు. భారత్-రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశం నిమిత్తం సోమవారం రోజు భారత్ విచ్చేసిన ఆయన... దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. అంతకుముందు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్‌లు... రష్యా రక్షణమంత్రి జనరల్ సెర్గీ షోయిగు, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌లతో ద్వైపాక్షిక, 2+2 సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయ దేశాలు నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అమేఠీ (యూపీ)లోని ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో 6,01,427 ఏకే-203 రైఫిళ్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి.
ఈ బంధం స్థిరమైనది: మోదీ
ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా... భారత్, రష్యా సంబంధాలు స్థిరంగా, దృఢంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌కు రష్యా నమ్మదగిన భాగస్వామి అని, ఉభయ దేశాల మధ్య సహకారం మున్ముందూ కొనసాగుతుందని ఆకాంక్షించారు. శిఖరాగ్ర సమావేశం నిమిత్తం దిల్లీ చేరుకున్న పుతిన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. భారత్‌తో బంధానికి రష్యా ప్రాధాన్యమిస్తోందని, కొవిడ్ సమయంలో పుతిన్ పర్యటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ భారత్-రష్యా స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. వ్యూహాత్మక, ప్రత్యేక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోంది’’ అని మోదీ పేర్కొన్నారు. అఫ్గాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్... ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారత్‌తో కలిసి పోరాడతామని చెప్పారు.
28 అంశాల్లో అంగీకారం...
మోదీ, పుతిన్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చిన పలు అంశాలను విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా వెల్లడించారు. ‘‘తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన సహా భారత్‌కు సంబంధించిన రక్షణ సవాళ్లన్నీ నేతల మధ్య చర్చకు వచ్చాయి. అఫ్గానిస్థాన్ విషయంలో ఇరు దేశాలు సన్నిహిత సంప్రదింపులు, సమన్వయం కొనసాగించాలని నేతలిద్దరూ నిర్ణయించారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వరాదని, ఉగ్రవాద చర్యలకు ఉపయోగపడకూడదని అభిప్రాయపడ్డారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాడాలని, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించారు. ఇంధన రంగంలో వ్యూహాత్మక సహకారంపైనా చర్చించారు. రెండు దేశాల మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరాయి’’ అని ఆయన వివరించారు.
డ్రాగన్ సైనికీకరణకు పాల్పడుతోంది...