హైదరాబాద్ మహానగరంలో మహాగణపతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జంటనగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి విశేషసంఖ్యలో తరలివస్తున్నారు. వినాయకుడికి భక్తులు గజమాల సమర్పించారు. ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం.. కండువా, జంజం, గరికమాల సమర్పించింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఐజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
Khairtabad Ganesh : భాగ్యనగరంలో గణేశుల సందడి.. ట్రాఫిక్ ఆంక్షలు షురూ..! - Khairtabad Ganesh
భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గల్లీకో గణపతితో నగరమంతా ఆధ్యాత్మికశోభను సంతరించుకుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సందడి అంతాఇంతా కాదు. తెల్లవారుజాము నుంచే నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ ఆ ప్రాంగణమంతా లంబోదరుడి నామస్మరణతో మార్మోగింది.
ఉదయం 11.30 గంటలకు పంచముఖ రుద్రమహాగణపతికి పూజలు చేయనున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ లంబోదరునికి తొలిపూజ నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విఘ్నేశ్వరుణ్ని దర్శించుకోనున్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఖైరతాబాద్ గణపయ్య దర్శనానికి భక్తులు వస్తారు. రద్దీని నియంత్రించుకునేందుకు ఖైరతాబాద్ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి 19 వరకు నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. వాహనరాకపోకలను నియంత్రిస్తూ కేవలం భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని విజ్ఞప్తి చేశారు.