యువతరం ఆలోచనలను ఆవిష్కరణలుగా మలుచుకునేందుకు టీ-హబ్ ద్వారా ప్రోత్సహిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం...ఆ దిశగా గ్రామీణ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ, పల్లె సృజన ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో వైద్య, వ్యవసాయ, సాంకేతిక రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో విద్యార్థులు, యువకులు, రైతులు తయారు చేసిన 60కి పైగా ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు. వాటిని వీక్షించేందుకు నగర నలుమూలల నుంచి సందర్శకులు తరలిరావడం వల్ల ప్రదర్శన ప్రాంగణం సరికొత్త కళను సంతరించుకుంది.
చిన్న పిల్ల కాదు.. చిచ్చర పిడుగు
హైదరాబాద్‌లోని సిద్ధార్థ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్న శివాని... తన ముగ్గురు స్నేహితులతో కలిసి సోలార్ ఇండోర్ వాటర్ ప్లాంట్ సిస్టమ్‌ను రూపొందించింది. పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో రెండు వారాలపాటు శ్రమించి ఈ ఆవిష్కరణకు కార్యరూపం ఇచ్చిన శివానీ.... ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొక్కలకు నీరందేలా వాటర్ ప్లాంట్ సిస్టమ్‌ను తయారు చేసింది. శివానీ ఆవిష్కరణకు ఇప్పటికే ముంబయిలో జరిగిన ప్రదర్శనలో ఉత్తమ బహుమతి అందుకోగా... తాజాగా ఈ గ్రామీణ ఆవిష్కరణలోనూ చోటు దక్కడం పట్ల శివాని ఆనందం వ్యక్తం చేస్తోంది.
కలుపుతీత సులభతరం
యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన అరిగె బాలయ్యకు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో గ్రామంలో వెల్డింగ్ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాడు. తనతోపాటు చిన్నకారు రైతులకు ఏదైనా ఉపయోగపడే పరికరం తయారు చేయాలని భావించిన బాలయ్య... మూడేళ్లు శ్రమించి స్కూటర్ వీడర్‌ను తయారు చేశాడు. ఈ ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమైన బాలయ్య పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా కలుపు యంత్రాన్ని తయారు చేసి రైతులకు భారంగా మారిన కలుపుతీతను సులభతరం చేశాడు. బాలయ్య తయారు చేసిన ఈ స్కూటర్ వీడర్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం విశేషం.