తెలంగాణ

telangana

ETV Bharat / city

Cheque bounce: అత్యాచారం బాధితురాలికి చెల్లని చెక్కు.. వివరణ ఇచ్చిన ఐసీడీఎస్‌ - guntur district latest news

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి అత్యాచారం ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఇచ్చిన రూ.25 వేల చెక్కు చెల్లకపోవడం చర్చనీయాంశమైంది. గుంటూరు ఐసీడీఎస్‌ అధికారులు ఇచ్చిన చెక్కు ఖాతాలో డబ్బు లేని కారణంగా చెక్కు చెల్లలేదని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. దీనిపై ఐసీడీఎస్‌ అధికారులు తమకు ఫోన్‌ చేశారని.. ఒకట్రెండు రోజుల్లో డబ్బు వేస్తామని వివరించినట్లు వారు తెలిపారు.

చెల్లని చెక్కు
చెల్లని చెక్కు

By

Published : Jul 1, 2021, 11:50 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఇచ్చిన రూ.25 వేల చెక్కు చెల్లలేదు. విజయవాడకు చెందిన బాధితురాలు.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం రెండు చెక్కులు ఇచ్చింది. రూ.5 లక్షల చెక్కును ఆ కుటుంబం మార్చుకుంది. దీనికి సంబంధించిన నగదు వారి ఖాతాలో జమ అయింది. దీంతో పాటు గుంటూరు ఐసీడీఎస్‌ అధికారులు రూ.25వేల చెక్కు ఇచ్చారు.

వివరణ ఇచ్చిన ఐసీడీఎస్‌ అధికారులు..

బాధితురాలి కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లి దానిని డిపాజిట్‌ చేశారు. మంగళవారం బ్యాంకులో ఆరా తీయగా ఖాతాలో డబ్బు లేని కారణంగా చెక్కు చెల్లలేదని సమాధానం ఇచ్చారని వారు తెలిపారు. బుధవారం గుంటూరు ఐసీడీఎస్‌ అధికారులు తమకు ఫోన్‌ చేశారని.. ఒకట్రెండు రోజుల్లో డబ్బు వేస్తామన్నారని వివరించారు. చెక్కు జారీ చేసిన ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతోనే చెల్లలేదని మరో ఖాతా నుంచి డబ్బు ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్‌ అధికారులు వివరణ ఇచ్చారు.

కాబోయే భర్తను కట్టేసి అత్యాచారం...

గతనెల 19న జరిగిన ఈ అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాబోయే భర్తతో కృష్ణానది పుష్కర ఘాట్​ వద్దకు వెళ్లిన సమయంలో ఇద్దరు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ముఖాన్ని ఇసుకలో కుక్కేసి, ఊపిరాడనివ్వకుండా చేసి పాశవికంగా అకృత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం... అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందజేశారు. ఈ కేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన ఇంకా నిందితులను పట్టుకోలేక పోయారు.

పటిష్ఠ బందోబస్తు..

తాడేపల్లి అత్యాచార ఘటనతో అప్రమత్తమైన పోలీసులు..... సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్యం, సీసాలు, చెత్తతో అపరిశుభ్రంగా ఉన్న ఘాట్ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. రాత్రిళ్లు కూడా విద్యుత్‌దీపాలు వెలిగేలా మరమ్మతులు చేయిస్తున్నారు. చీకటి పడ్డాక సేదతీరేందుకు వచ్చే వారిని నిలువరించేందుకు..... మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:Suicide Attempt: డీఎస్పీ కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details