Manickam Tagore : తెలంగాణలో తెరాసతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. అదంతా అవాస్తవమని... పూర్తిగా నిరాధారమని ట్విటర్ ద్వారా వెల్లడించారు. భాజపా, తెరాసలపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో ఒక్క ఇంచు కూడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తెరాస వాళ్లే చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. వచ్చే నెల 6వ తేదీన వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభలో తమ పార్టీ బలం ఏంటో చూపిస్తామని వెల్లడించారు.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో, డీసీసీలతో వివిధ అంశాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మాణిక్కం ఠాగూర్‌లు చర్చించారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది కాంగ్రెస్ సభ్యులకు ప్రమాద బీమా కల్పించిన విషయమై ఈ సమావేశాలల్లో చర్చించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటన అధికారికంగా ఖరారు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఆత్మహత్యలు తదితరాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది.