జాతీయ జెండా అంటే దేశపు గౌరవం, కీర్తి పతాక. ఎగరేయాలన్నా, అవనతం చేయాలన్నా అనేక నియమాలు పాటించాల్సిందే. ఇప్పుడు ఆ నిబంధనల అమలుపై గ్రేటర్‌లో ఆందోళన మొదలైంది. జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా 20లక్షల జెండాలను పంపిణీ చేశారు. పౌరులు సైతం పెద్దఎత్తున జాతీయ పతాకాలను వ్యక్తిగతంగా కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు వాటిని నిబంధనల ప్రకారం కనిపించకుండా చేయడం సవాలుగా మారింది. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో స్థానిక మున్సిపాలిటీలు ఉపయోగించిన జెండాలను సేకరించేందుకు స్వచ్ఛంద సంస్థలను, కాలనీ సంక్షేమ సంఘాలను, ఇతర సంస్థలను రంగంలోకి దించాయి. నగరంలోనూ అదే మాదిరి ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇతర నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. దిల్లీ మున్సిపల్ అధికారులు 2,500 కాలనీ సంక్షేమ సంఘాలతో ఏర్పాటైన ఐక్య కార్యాచరణ సమితి సభ్యులకు, సఫాయి కార్మికులకు ఆదేశాలిచ్చారు. కాలనీ సంఘాలు, కార్మికులు యుద్ధప్రాతిపదికన ప్రతి ఇంటికి వెళ్లి జెండాలను సేకరించి జోనల్ కంట్రోల్ రూముల్లో అందజేయాలని స్పష్టం చేశారు. ముంబయి నగర పాలక సంస్థ సైతం కాలనీ సంక్షేమ సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, పారిశుద్ధ్య విభాగానికి జెండాల సేకరణ బాధ్యత అప్పగించింది. సామాజిక మాధ్యమాల ద్వారా దిల్లీ, ముంబయి నగరపాలక సంస్థలు ప్రచారం ప్రారంభించాయి.
జీహెచ్‌ఎంసీ స్పందించాలంటూ..ఇంటిపై ఎగరేసిన జెండాను ఎప్పుడు దించాలి, ఎలా విసర్జనం చేయాలనే సూచనలు నగరవాసులకు అందలేదు. జీహెచ్‌ఎంసీ ఆ విషయంలో మౌనం ప్రదర్శిస్తోంది.