ప్రగతి చక్రాలపై నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు పరుగులు తీయించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు అచేతనంగా మిగిలారు. సమ్మెలో ఉన్న వారి కుటుంబాలు అర్ధాకలితో పస్తులుంటున్నాయి. కార్మికులు విధులకు దూరమై 51 రోజులు గడిచిపోయాయి. మళ్లీ విధుల్లోకి వెళ్లగలరో లేదో తెలియదు. ఒక్క నెల జీతం రాకపోతేనే విలవిలలాడే బతుకులవి. ఏకంగా రెండు నెలలుగా జీతాల్లేక జేబులు నిండుకున్నాయి. చేబదుళ్లతో నెట్టుకొస్తున్నారు. అవి కూడా దొరకని వారు సొమ్ములు లేక సొమ్మసిల్లుతున్నారు.
ఆత్మహత్యలు.. ఆగుతున్న గుండెలు
ఒకవైపు ఆత్మహత్యలు, మరోవైపు దిగులు మరణాలతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళనలు ఆవరించాయి. ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు, పాలు, వెచ్చాలు... ఇలా దేనికీ డబ్బుల్లేవు. అప్పులిచ్చేవాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం అన్నది ప్రశ్నార్థకమే.
జీతం లేక... జీవితం దక్కక..
నాగేశ్వర్ అనే కండక్టర్ ఇటీవల మనోవేదనతో మృతి చెందారు. ఆయన భార్య సుజాత, ఇద్దరు కుమారులు వీరు. తన భర్త దూరమైన వైనాన్ని సుజాత కన్నీళ్లతో ఏకరువు పెట్టారు... ‘ఉద్యోగం ఉంటుందా? లేదా? అన్న మనోవేదనతో ఆయన మంచాన పడ్డారు. నిద్రలో టికెట్...టికెట్ అని కలవరించేవారు. నారాయణ్‌ఖేడ్‌లో ఉండేవాళ్లం. జీతం లేక జోగిపేటకు మకాం మార్చాం. ఆయనను తార్నాక ఆస్పత్రికి తీసుకెళ్తే సమ్మెలో ఉన్నందున వైద్యం చేయబోమన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేర్చితే రెండు రోజులకు చనిపోయారు. అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోతే యూనియన్ నాయకులు సాయం చేశారు. నేను, ఇద్దరు కుమారులు రోడ్డున పడ్డాం. చదువు మానేసిన కొడుకు మోటారు సైకిల్ మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు’ అని వాపోయారు.