రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరింది. సమ్మె చేస్తున్న సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా.. కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. డిమాండ్ల సాధనకు ఎంతవరకైనా పోరాడుతామని ప్రకటించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వీలైనన్ని బస్సులు నడిపేందుకు ప్రైవేటు డ్రైవర్లను నియమిస్తోంది. ప్రజల అవసరాలకు సరిపోకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలపైనే సాధారణ ప్రజానీకం ఆధారపడుతోంది.
ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. బస్సు డిపోల ఎదుట తాత్కాలిక ఉద్యోగాల కోసం బారులు తీరుతున్నారు. పత్రాలు, ఇతర పరీక్షల అనంతరం అధికారులు వారిని తాత్కాలిక విధుల్లోకి తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న బస్సులను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకుంటున్నారు.