తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ సమ్మె సుఖాంతం.. వ్యాజ్యం కొట్టివేత..! - ts rtc strike news

ఆర్టీసీ సమ్మె సుఖాంతమైందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం కార్మికులందరినీ విధుల్లోకి చేర్చుకుందని.. ఇక ఈ విషయంలో విచారించాల్సిన అంశాలేవి లేవని వ్యాఖ్యానించింది.

ఆర్టీసీ సమ్మె సుఖాంతం.. వ్యాజ్యం కొట్టివేత..!
ఆర్టీసీ సమ్మె సుఖాంతం.. వ్యాజ్యం కొట్టివేత..!

By

Published : Dec 2, 2019, 5:21 PM IST

ఆర్టీసీ సమ్మెలో ప్రభుత్వం కార్మికులను చర్చలకు పిలవకపోవడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారం సుఖాంతమైందని ధర్మాసనంవ్యాఖ్యానించింది. కార్మికుల ఆత్మహత్యలను నిలువరించి చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు పిటిషన్​ దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఈ వివాదం ముగిసినందున.. వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

కార్మికులందరిని విధుల్లోకి తీసుకున్నారు

వ్యాజ్యంలో కోరిన అభ్యర్థన ఇప్పటికే నెరవేరిందని న్యాయస్థానం పేర్కొంది. కార్మికులందరినీ విధుల్లోకి చేర్చుకున్నారని.. ప్రభుత్వం కార్మిక న్యాయస్థానానికి వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని.. సెప్టెంబరు నెల వేతనాలు ఇస్తామని ప్రకటించిందని.. 100 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మంజూరు చేయనున్నట్లు తెలిపిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కార్మిక సంఘాలను ఆహ్వానించలేదు

అయితే చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పుడు మొండిగా వ్యవహరించిన సర్కారు.. ఇప్పుడు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోందని పీఎల్ విశ్వేశ్వరరావు వాదించారు. సీఎం కార్మికులను మాత్రమే చర్చలకు పిలిచి.. కార్మిక సంఘాలను ఆహ్వానించలేదన్నారు. కార్మిక సంఘాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందాయని.. వాటిని పిలవకపోవడం చట్ట విరుద్ధమని పీఎల్ విశ్వేశ్వరరావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారం రాజ్యాంగ పరిధిలోనే జరగాలన్నారు.

కార్మిక సంఘాలకు ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే.. సంబంధిత అథారిటీని ఆశ్రయించవచ్చునని హైకోర్టు సూచించింది. చట్ట బద్ధమైన హక్కుల కోసం కార్మిక సంఘాలు సొంతంగా పోరాడగలవని.. వాటి కోసం సాధారణ ప్రజలు... హైకోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది.

ఇదీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు.. ఛార్జీలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details