ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ కారణంగా దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే 50 శాతం సీట్ల సామర్థ్యంతో నడుపుతుండగా, బుధవారం నుంచి కనీసం 35 శాతం సీట్లలో ప్రయాణికులు నిండితేనే బస్సులు బయలుదేరనున్నాయి. ఓ ప్రాంతానికి వెళ్లే రెండు మూడు సర్వీసులను కలిపి, ఒకే సర్వీసుగా పంపనున్నారు. బస్టాండ్లకు వచ్చే ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు నడుపుతామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లా అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల కోసం నడిపే సర్వీసులు అన్నింటినీ మాత్రం కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రైవేట్ బస్సులకు అంతే....
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సైతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నడిచే సర్వీసులనే తిప్పనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటూ ప్రైవేట్ బస్ ఆపరేటర్ల సంఘం నేతలు.. అందులోని సభ్యులందరికీ మంగళవారం తెలియజేశారు. ఇప్పటికే ప్రయాణికులు లేక 75-80శాతం సర్వీసులు ఆపేశామని, కర్ఫ్యూతో మిగిలిన సర్వీసులు కూడా దాదాపు నిలిచిపోయే అవకాశం ఉందని బస్సుల యజమానులు పేర్కొంటున్నారు.