విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో వారం రోజుల్లో లిఖితపూర్వంగా తెలియజేయాలంటూ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డికి తెలంగాణ ఆర్టీసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2019, డిసెంబరు నుంచి సుమారు ఏడాదికి పైగా ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారని నోటీసు జారీ చేసింది.
అశ్వత్థామరెడ్డికి షోకాజ్ నోటీసు.. లిఖితపూర్వక వివరణకు ఆదేశం - అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ షోకాజ్ నోటీసు
తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్ధామరెడ్డికి ఆర్టీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చిదంి. ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదని సూటీ ప్రశ్నించింది. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆర్టీసీ ఆదేశించింది.

‘‘విచారణకు హాజరు కావాలని పలు దఫాలు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. పోస్టు ద్వారా పంపిన లేఖలు తిరిగి వస్తుండటంతో వాట్సప్ ద్వారా నోటీసులు పంపాం. అయినా స్పందన లేదు’’ అని ఆ షోకాజ్ నోటీసులో ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గతంలో పంపిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరవకపోవడంతో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విచారణాధికారి నివేదిక అందజేశారు. మరోసారి అవకాశం ఇవ్వాలని మరోదఫా నోటీసు జారీ చేశాం. అనారోగ్య కారణాల వల్ల విధులకు హాజరు కానీ రోజులను సెలవుగా పరిగణించాలంటూ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినా విధులకు హాజరు కాలేదు. విచారణాధికారి నివేదిక మేరకు ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలంటూ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఇవీ చూడండి:ఉద్యోగుల పీఎఫ్, ఐటీ డబ్బులు దోచుకున్న కేటుగాళ్లు