ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను(RTC EMPLOYEES) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ -PTD) ఉద్యోగులుగా గత ఏడాది జనవరి 1 న విలీనం చేయడంతో వారంతా సంబరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు మేలు కలుగుతుందని భావించారు. అయితే ఆర్టీసీలో ఇంతకాలం ఉన్న ప్రయోజనాలను తొలగించగా, సర్వీసు నిబంధనల ఉత్తర్వులతో వేలసంఖ్యలో ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో 52 వేలమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
పింఛనుపైనే ఆశలు..
ప్రభుత్వ ఉద్యోగులయ్యాక పింఛను వస్తుందని ఆశపడ్డారు. 2004కు ముందున్న పాత పింఛను(PENSION) విధానం అమలు కావాలని కోరుతున్నా, దీనిపై స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకున్న సీపీఎస్ వీరికి అమలు చేయట్లేదు. ప్రభుత్వం పాత పింఛను విధానం మళ్లీ తీసుకొచ్చినా.. పీటీడీ ఉద్యోగులు గత ఏడాది జనవరిలో విలీనమైనందున వీరికి అది వర్తించదనే వాదన ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పాత పథకం పోయింది..
ఆర్టీసీలో 1989 నుంచి సిబ్బంది పదవీవిరమణ ప్రయోజన పథకం ఉండేది. జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తం రికవరీ చేసి.. దానికి యాజమాన్య వాటా జతచేసేవారు. పదవీవిరమణ తర్వాత నెలకు రూ.3,200 వరకు నెలవారీ నగదు ప్రయోజనం ఎంసీబీ(MCB) కింద అందజేసేవారు. ఉద్యోగి మరణిస్తే, జీవిత భాగస్వామికి ఈ మొత్తం అందేది. విలీనంతో ఆ పథకాన్ని రద్దుచేశారు. ఇంతకాలం రికవరీ చేసిన మొత్తాన్ని వెనక్కి ఇస్తామని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఆర్టీసీలో పదవీ విరమణలు మొదలుకానున్నాయి. వీరికి ఎలాంటి పింఛను లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.
ఆకస్మిక మరణానికి సాయం ఉండేది..
ఆర్టీసీలో 1980 నుంచి స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ స్కీమ్ ఉండేది. జీతం నుంచి నెలకు కొంత మొత్తం రికవరీ చేసేవారు. సర్వీసులో ఉండగా చనిపోతే(SUDDEN DEATH) కుటుంబానికి రూ.లక్షన్నర సాయంతోపాటు, అప్పటివరకు రికవరీ చేసిన మొత్తాన్ని వడ్డీతో అందించేవారు. ఒకవేళ ఉద్యోగి పదవీవిరమణ చెందితే.. వడ్డీతో అందజేస్తారు. గత ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని నిలిపేశారు. ప్రభుత్వంలో ఏపీజీఎల్‌ఐసీ పథకాన్ని పీటీడీ ఉద్యోగులకు అమలుచేశారు. దీనికి అయిదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధనతో చాలామంది అనర్హులయ్యారు. గతంలో ఆర్టీసీ యాజమాన్యమే పూర్తిగా నిధులు వెచ్చించి వైద్యం అందించేది. పదవీవిరమణ తర్వాతా ప్రతినెలా మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈహెచ్‌ఎస్‌లో పరిమితులతో ఇబ్బంది పడుతున్నారు.