APSRTC Charges Hike: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. అయితే, డీజిల్ సెస్ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. డీజిల్ సెస్ పెంపు కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది.
అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈమేరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు టీఎస్ ఆర్టీసీ అధికారులు గతంలో సర్క్యులర్‌లను కూడా పంపారు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు టికెట్ ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది.