నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. సురక్షిత ప్రయాణం అందించించిన ఆర్టీసీ ఏదీ చేపట్టినా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో కార్గో, కొరియర్ సేవలు ప్రారంభించింది. ఇప్పటికే 150 కార్గో బస్సులు అందుబాటులోకి తీసుకురాగా... అదనంగా మరో 50 చిన్న కార్గో బస్సులను సిద్ధం చేసే పనిలో పడింది. ప్రస్తుతం కార్గో బస్సులను ఎఫ్‌సీఐ, విత్తన కంపెనీలకు, మార్కెటింగ్ సంస్థలకు, వ్యవసాయ శాఖకు, టీఎస్ ఫుడ్స్‌కు కార్గో బస్సులను నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, బెంగుళూరుకు కూడా ఏజెంట్లను నియమించనుంది. వీటికి సాంకేతికతను జోడించి యాప్‌ను, టిమ్స్ కూడా అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీకి కార్గో బస్సులు, పార్శిల్ సర్వీసులతో రోజుకి రూ. 5 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
భీమా కూడా..
కార్గో, పార్శిల్, కొరియర్ సేవల్లో కీలకమైన ఏజెంట్ల నియామకం పూర్తయింది. 140 డిపోల్లో ప్రస్తుతం ఈ సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జడ్చర్ల బస్టాండ్లలలో ఎక్కువగా లాభాలు వస్తున్నట్టు అధికారులు వివరించారు. కార్గో, పార్శిల్ సేవలకు కలిపి సుమారు 540మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామానాకి కార్గో, పార్శిల్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కార్గో బస్సుల్లో 8 నుంచి 9 టన్నుల వరకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. పార్శిల్‌కు సంబంధించిన ధరలను వెల్లడించిన అధికారులు... అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరవేస్తామని తెలిపారు. పార్శిల్‌పై రూ. 5 నుంచి రూ.10 చెల్లింపుతోనే బీమా కూడా అందిస్తున్నారు.